ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో దిగడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇదే ఆ టీమ్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
గత సీజన్లలో మాదిరిగానే ఐపీఎల్ 2023లోనూ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు. అయితే ఆశించినంత స్థాయిలో ఆ టీమ్ రాణించడం లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో మూడింట ఓడిన ఆర్సీబీ.. మరో మూడు మ్యాచుల్లో గెలుపొందింది. ఈ సీజన్లో పడుతూ లేస్తూ ముందుకు వెళ్తున్న ఫాఫ్ డుప్లెసిస్ సేన మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో సొంత మైదానంలో తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, చెట్ల పంపకం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆర్సీబీ గత 11 సంవత్సరాలుగా కృషి చేస్తోంది.
ఐపీఎల్లో 2011 నుంచి ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతోంది ఆర్సీబీ టీమ్. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా టాస్ సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు ఒక మొక్కను గిఫ్ట్‌గా అందజేస్తారు. ఈసారి సొంత మైదానంలో గ్రీన్ జెర్సీతో దిగుతోంది. దాదాపు మూడు సీజన్ల తర్వాత సొంత మైదానంలో ఈ జెర్సీ వేసుకుని ఆడనున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. అయితే ఈ జెర్సీ ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది. ఈ జెర్సీలతో ఆడిన మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి మంచి రికార్డు లేకపోవడం ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ జెర్సీతో 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం మూడింట్లో మాత్రమే విజయం సాధించి.. ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఈసారి ఏమవుతుందోననేది ఆసక్తిని రేపుతోంది. మరి.. గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ.. రాజస్థాన్ రాయల్స్ మీద గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RCB in Green Jersey pic.twitter.com/PYpuGE1U2z
— RVCJ Media (@RVCJ_FB) April 22, 2023