కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో ఆ టీమ్ పాయింట్ల పట్టికలో మరింత దిగువకు పడిపోయింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ ప్లేఆఫ్స్ ఆశలను మరింత క్లిష్టతరం చేసుకుంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇక, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ఆ జట్టులో వెంకటేష్ అయ్యర్ (57) ఒక్కడే రాణించాడు. కెప్టెన్ నితీష్ రానా (22), రెహ్మదుల్లా గుర్బాజ్ (18) తమకు లభించిన మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లతో రాణించాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఏకంగా 4 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరిచాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు గొప్ప ఆరంభం దక్కింది.
రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే ఏకంగా 26 రన్స్ బాదాడు. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రానా బౌలింగ్‌లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో భారీగా రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాత సింగిల్ తీసే క్రమంలో సమన్వయ లోపంతో జాస్ బట్లర్ రనౌట్ అయినా.. మిగిలిన పనిని సంజూ శాంసన్ (48)తో కలసి జైస్వాల్ (98) ఫినిష్ చేశాడు. వీళ్లిద్దరి హిట్టింగ్ ధాటికి లక్ష్యం చిన్నబోయింది. రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే టార్గెట్‌ను కంప్లీట్ చేసి నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ నితీష్ రానా తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా బెడిసికొట్టాయి. తక్కువ లక్ష్యం నిర్దేశించిన నేపథ్యంలో ప్రత్యర్థిని కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేయాలి. కానీ ఫస్ట్ ఓవర్‌ను నితీష్ రానా వేయడం హాట్ టాపిక్‌గా మారింది. స్పిన్నర్లను ఉతికి ఆరేసే జైస్వాల్.. పార్ట్ టైమర్ అయిన నితీష్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఏకండా అతడి ఓవర్లో 26 రన్స్ పిండుకున్నాడు.
ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర ప్రదర్శనకు నితీష్ రానానే కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మంచి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. అతడు కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే కోల్‌కతాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ అతడి వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించిందని క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు. ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే.. ఒకప్పుడు రెండుసార్లు కప్ గెలిచిన కేకేఆర్ జట్టు ఇదేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం కేకేఆర్ తాము గెలవడంతో పాటు ఇతర జట్ల విజయావకాశాలపై ఆధారపడే పరిస్థితి రావడానికి నితీష్ రానా ఫెయిల్యూరే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. కేకేఆర్‌ను అతడు నిండా ముంచాడని.. జట్టు పరువు తీసేశాడని మండిపడుతున్నారు.