ప్లేఆప్స్ రేసులో ముంబై ఇండియన్స్ దూసుకెళ్తోంది. గుజరాత్ టైటాన్స్‌పై విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు మరింత మెరుగయ్యాయి. అయితే అప్పుడే సంబురపడొద్దు. ఆ టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. లీగ్ ఆరంభంలో పరాజయాల పరంపరతో అభిమానులను ఆందోళనపర్చిన ముంబై.. కరెక్ట్ టైమ్‌కు ట్రాక్‌లోకి వచ్చింది. ప్లేఆఫ్స్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వరుస విక్టరీలతో బౌన్స్ బ్యాక్ అయింది. మ్యాచ్ మ్యాచ్‌కు ప్లేఆఫ్స్ ఆశలను పెంచుకుంటూ పోతోంది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 రన్స్ తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది ముంబై. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 218 రన్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (31), రోహిత్ శర్మ (29) జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా సారథి రోహిత్ మూడు ఫోర్లు, రెండు సిక్సులతో గుజరాత్ బౌలర్లను ఉన్నంత సేపు భయపెట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (49 బాల్స్‌లో 103) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.
సూర్య మైదానం నలువైపులా షాట్లు కొట్టడంతో గుజరాత్ బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. అతడికి తోడుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విష్ణు వినోద్ (30) కూడా హిట్టింగ్‌కు దిగడంతో ముంబై 218 రన్స్ భారీ స్కోరును టార్గెట్‌గా సెట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టైటాన్స్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు సాహా (2), శుబ్‌మన్ గిల్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వీరిని రెండు చక్కటి బాల్స్‌తో ఆకాష్ మధ్వాల్ పెవిలియన్‌కు పంపాడు. టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా (4) కూడా రాణించలేదు. అయితే విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (41) బాగా ఆడటంతో టైటాన్స్ కుదురుకున్నట్లే కనిపించింది. ఆ తర్వాత రషీద్ ఖాన్ (32 బాల్స్‌లో 79) ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. ఏకంగా 10 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో గుజరాత్ విజయంపై ఆశలు రేగినా.. రషీద్‌కు సహకరించే మరో బ్యాట్స్‌మన్ లేకపోవడంతో ఆ టీమ్‌కు ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ఇండియన్స్ మరో రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మొత్తంగా 12 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు 7 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. గుజరాత్‌పై విజయంతో ముంబై ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మరింత పెరిగాయి. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ 80 శాతం ఉంది. కానీ నెట్ రన్‌రేట్ మాత్రం ఇంకా మైనస్‌లోనే ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలు గట్టిగానే ఉన్నా తర్వాతి రెండు మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. ఒక మ్యాచ్‌లో నెగ్గి ఇంకో మ్యాచ్‌లో ఓడిపోయినా సరే ఎక్కువ తేడాతో గెలిచితీరాలి. అప్పుడు రోహిత్ సేన ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది లేదంటే ఇంటికి వెళ్తుంది. ఈ ఇబ్బందులు ఉండొద్దంటే తర్వాతి రెండు మ్యాచ్‌లు ముంబై ఎలాగైనా నెగ్గితీరాలి.