ఈ సీజన్ ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఫలితం తేలడం లేదు. ప్రతి జట్టు విజయం కోసం సమిష్టి కృషి చేస్తోంది. ఐపీఎల్ అనగానే మీకు మ్యాచ్ లు, విజయాలే కాదు.. బెట్టింగ్, ఫిక్సింగ్ లాంటి పదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఐపీఎల్ 2023 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఐపీఎల్ సీజన్ నడుస్తోంది అంటే బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదాలు బాగా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడు. ఎవరో ఒక వ్యక్తి తనని మ్యాచ్ ఫిక్సింగ్ వ్వహారంలో సంప్రదించినట్లు.. సిరాజ్ బీసీసీఐ యాంటీ కరప్షన్ వింగ్ దృష్టికి తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన బీసీసీఐ అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో సిరాజ్ అనూహ్యమైన గణాంకాలను నమోదు చేస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో జట్టులో కీలక బౌలర్ గా మారుతున్నాడు. ఇప్పుడు సిరాజ్ పర్ఫార్మెన్స్ పరంగా కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నాడు. సిరాజ్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించాడు. గుర్తుతెలియని వ్యక్తి తనని మ్యాచ్ లకు సంబంధించి సంప్రదించినట్లు వెల్లడించాడు. సిరాజ్ కి బెట్టింగ్, డబ్బు విషయంలో వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు.
ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన బీసీసీఐ యాంటీ కరప్షన్ వింగ్ సదరు వ్యక్తిని గుర్తించింది. అతను హైదరాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ గా గుర్తించారు. ఆ వ్యక్తి బెట్టింగ్ లో భారీగా డబ్బు కోల్పోయినట్లు తెలిపారు. ఇదే విషయంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. “సిరాజ్ ని సంప్రదించింది బుకీ కాదు. అతను క్రికెట్ బెట్టింగ్ కి బానిసై పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయాడు. ఆర్సీబీ అంతర్గత సమాచారం కోసం సిరాజ్ ని సంప్రదించాడు. సిరాజ్ మాకు ఆ విషయాన్ని తెలపడంతో.. లా ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారించారు” అంటూ బీసీసీఐకి చెందిన అధికారి వెల్లడించారు. మహ్మద్ సిరాజ్ చేసిన ఈ పనిని కచ్చితంగా అభినందించాల్సిందే అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మహ్మద్ సిరాజ్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాడంటూ ప్రశంసిస్తున్నారు.
Mohammed Siraj was approached during the ODI series between India and Australia in March, just before IPL 2023 began, and promptly reported the matter to BCCI’s Anti-Corruption Unit https://t.co/olMzihjc2Q pic.twitter.com/msat4phc3D
— ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2023