రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందంటే క్రికెట్ అభిమానులకు అసలు ఐపీఎల్ మజా అంటే ఏంటో మళ్లీ ఒకసారి రుచిచూపించింది. ఒకానొక సమయంలో 20 ఓవర్లలో 220 వరకు పరుగులు చేస్తారని భావించిన రాయల్స్‌ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు చాలా బాగా కట్టడి చేశారు. టార్గెట్‌ను 186కు కుదించగలిగారు. పంజాబ్ ఆరంభం, వారి బ్యాటింగ్ చూసిన అభిమానులు ఇంక విజయం పంజాబ్ కింగ్స్‌దే అని ఫిక్స్ అయిపోయారు. ఆఖరి ఓవర్లో విజయం కోసం 4 పరుగులు చేస్తే చాలు. ఐపీఎల్‌లో ఆఖరి బంతి వరకు ఓటమిని, విజయాన్ని అంచనా వేయలేమని ఈ మ్యాచ్‌లో మరోసారి రుజువైంది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు అర్పించుకున్నారు కింగ్స్.
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూసిన ఎవరైనా విజయం ఖాయమనే అనుకున్నారు. 11.5 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పంజాబ్ కింగ్స్ 120 పరుగులు చేశారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(33 బంతుల్లో 49 పరుగులు), మయాంక్ అగర్వాల్(43 బంతుల్లో 67) మెరుపు బ్యాటింగ్ చూశాక రాయల్స్ కూడా విజయంపై ఆశలు వదిలేసుకుంది. రాహుల్, మయాంక్ భాగస్వామ్యాన్ని చేతన్ సకారియా విడదీయగలిగాడు. రాహుల్ వెనుదిరిగిన తర్వాతి ఓవర్లోనే మయాంక్ కూడా పెవిలియన్ చేరాడు.అయినా మ్యాచ్ పంజాబ్ వైపే ఉంది. నికోలస్ పూరన్ బ్యాటింగ్‌తో పంజాబ్‌కు ఇంకా నమ్మకం పోలేదు.
ఆఖరి ఓవర్‌లో కార్తిక్ త్యాగి అద్భుతం చేశాడు. విజయం ముంగిట ఉన్న పంజాబ్ కింగ్స్‌కు పరాజయాన్ని పరిచయం చేశాడు. ఆఖరి ఓవర్‌కు 4 పరుగులు చేయాల్సి ఉంది. గట్టిగా ఒక్క షాట్ కనెక్ట్ అయినా కూడా మ్యాచ్ అయిపోతుంది. మొదటి బంతిని డాట్ మలిచాడు. రెండో బంతికి మార్కరం సింగిల్ తీయడంతో అప్పటి వరకు పిచ్చ ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. త్యాగి వేసిన బంతిని కనెక్ట్ చేసే క్రమంలో టాప్ ఎడ్జ్ అయ్యి కీపర్‌కు దొరిపిపోయాడు పూరన్. తర్వాతి బంతిని త్యాగీ మళ్లీ డాట్‌గా వేయగలిగాడు. క్రీజులోకి కొత్త బ్యాట్స్‌మన్‌గా వచ్చిన దీపక్ హుడాని ఆఖరి ఓవర్ ఐదో బంతికి డక్‌గా పెవిలియన్‌కు చేర్చాడు త్యాగి. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి.. ఇంకా పంజాబ్ వైపే ఆశలు ఒక్క బంతికి 3 పరుగులు చేయాలి. ఈసారి అందరూ సూపర్ ఓవర్ ఖాయమని భావించారు. కానీ, ఆఖరి బంతిని డాట్‌గా వేసిన త్యాగి రాజస్థాన్ రాయల్స్‌కు 2 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
అద్భుతమైన బౌలింగ్.. మెరుపు బ్యాటింగ్‌తో మొదలైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను తక్కువ అంచనా వేసి పరాజయం పాలయ్యాయని భావిస్తున్నారు. గంతలోనూ పంజాబ్ ఇలాంటి పరాజయాలను చూసింది. తప్పుల నుంచి నేర్చుకోక పోగా.. మళ్లీ అవే తప్పులు రిపీట్ చేశారు పంజాబ్ కింగ్స్.
So it wasn’t a dream. 💗#HallaBol | #RoyalsFamily | #IPL2021 pic.twitter.com/zswlSJw5CQ
— Rajasthan Royals (@rajasthanroyals) September 22, 2021