హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకేసింది. టూరిస్టులు చూస్తుండగానే ఆ యువతి కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకింది. బ్రిడ్జ్ పై ఉన్న రైలింగ్స్ పైకి ఎక్కిన యువతిని బోట్ లో ఉన్న టూరిస్టులు గమనించారు. టూరిస్టులు చూస్తుండగానే ఆ యువతి చెరువులోకి దూకేసింది. వెంటనే ఓ యువకుడు ఆమెను కాపాడేందుకు చెరువులోకి దూకాడు. ఆ యువతి ఆచూకీ కోసం చెరువులో వెతికినా లాభం లేకుండా పోయింది. దీంతో టూరిస్టులు లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న లేక్ పోలీసులు యువతి మృతదేహం కోసం స్పీడ్ బోట్లతో యువతి ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్రిడ్జ్ పై హ్యాండ్ బ్యాగ్, చెప్పులు విడిచి చెరువులో దూకినట్లు గుర్తించారు. హ్యాండ్ బ్యాగ్ లో ఆమె ఆరోగ్యానికి సంబంధించి కామినేని హాస్పిటల్ రిపోర్టులు ఉన్నాయి. రిపోర్టుల ఆధారంగా యువతి పేరు స్వప్నగా గుర్తించారు పోలీసులు. అనారోగ్య కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు చెరువులో దూకిందో, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకోవాలనుకుందో అనే వివరాలు పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు. గతంలో ఏప్రిల్ 16న ఒక విద్యార్ధి, జూలై 30న ఒక మహిళ.. ఇదే కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీంతో సైబరాబాద్ పోలీసులు దుర్గం చెరువు వద్ద లేక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి, భద్రత కూడా ఏర్పాటు చేశారు. భద్రత ఉన్నప్పటికీ యువతి బ్రిడ్జ్ రైలింగ్స్ పైకి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.