నేటికాలంలో మనుషుల్లో మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. మనిషి ప్రాణం కంటే డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే వారు పెరిగిపోయారు. ఇంక దారుణం ఏమిటంటే… వంద రూపాయల నోటు ముందు మనిషి ప్రాణం కూడా తక్కువైపోతుంది. కొందరు వంద, రెండు వందల కోసం కూడా నిండు ప్రాణాలని బలి తీసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రూ.600 కోసం వృద్ధుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవురూకు చెందిన పఠాన్ చాన్ బాషా(64).. టౌన్ లోనే దర్గా పక్కనే వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పఠాన్ బాషా ఇంటి సమీపంలో ఖాదర్ బాషా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇరుగుపొరుగు వారు కావడంతో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండే వారు. అయితే వారం క్రితం పఠాన్, ఖాదర్ వద్ద రూ.600 అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం పఠాన్, ఖాదర్ వద్దకు వెళ్లి… తాను ఇచ్చిన రూ.600 ఇవ్వాలని అడిగాడు. దీంతో ప్రార్ధనకు సమయమైందని.. వెళ్లి వచ్చాక ఇస్తానని చెప్పి చాన్ బాషా తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఖాదర్ బాషా ఆయన బైక్ ను కాలితో తన్నాడు. దీంతో పఠాన్ ఒక్కసారిగా బైక్ పై నుంచి కిందపడిపోయాడు. అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఖాదర్.. చాన్ బాషా పై దాడి చేశాడు. దీంతో ఆయనకు బలమైన గాయమవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు హత్య కేసును నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. రూ.600 కోసం మనిషి ప్రాణం తీయడం స్థానికంగా సంచలనంగా మారింది.