కేరళలోని ఓ దంపతులు ధనవంతులు అవ్వాలని ఇద్దరు మహిళలను బలిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదంతం మరువక ముందే మరో కిరాతకం వెలుగులోకి వచ్చింది. కూతురికి దెయ్యం పట్టిందని ఓ తండ్రి వారం రోజులుగా నరకం చూపించాడు. ఇంతటితో ఆగకుండా.. కనీసం ఆ బాలికకు తినడానికి తిండి, తాగడానికి నీరు ఇవ్వకుండా కొట్టి చంపి పొలంలో పాతిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది గుజరాత్ గిర్ సోమనాథ్ జిల్లా, ధావ గ్రామం. ఇక్కడే నివాసం ఉంటున్న భవేష్ అనే వ్యక్తికి పెళ్లై 14 ఏళ్ల ధైర్య అనే కూతురు ఉంది. అయితే గత కొంత కాలం నుంచి ధైర్య ప్రవర్తనను గమనించిన తండ్రి భవేష్ కూతురుకి దెయ్యం పట్టిందని అనుకున్నాడు. ఇక దీంతో ఎలాగైన కూతురు ధైర్యను చంపాలని తండ్రి భవేష్ ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే భవేష్ తన సోదరుడు అయిన దిలీప్ సాయం తీసుకున్నాడు. అయితే వీళ్లిద్దరూ కలిసి ఈ నెల 1న భవేష్ కూతురు ధైర్యను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక.. భవేష్ కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలించాలని తండ్రి భవేష్, దిలీప్ అనుకున్నారు.
దీని కోసం మొదటి రోజు కూతురిని ఓ చెట్టుకు కట్టేసి తండ్రి దారుణంగా కొట్టాడు. ఇక రెండో రోజు కూడా సేమ్ సీన్. కర్రలతో కొట్టడం మొదలు పెట్టాడు. కనీసం కూతురికి తినడానికి తిండి, తాగడానికి నీరు ఏది ఇవ్వకుండా తండ్రి నరకం చూపించాడు. తండ్రి కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఆ బాలిక ఆకలికేకలతో తండ్రి చేతిలో నరకాన్ని చూసింది. అయితే మూడో రోజు మాత్రం తండ్రి భవేష్.. కూతురి జుట్టు, చేతులు, కాళ్లను కట్టేసి దారుణంగా చితకబాదాడు. అలా మరో రెండు రోజుల పాటు కూతురిని తీవ్ర హింసకు గురి చేశారు. అలా ఆరు రోజులు తర్వాత తండ్రి హింసను తట్టుకోలేని కూతురు ధైర్య చివరికి ప్రాణాలు విడిచింది. ఇక కూతురు చనిపోవడంతో తండ్రి భవేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా కూతురి దుస్తువులను మంటల్లో కాల్చారు. ఆ తర్వాత అదే పొలంలో గుంతు తీసి కూతురి ధైర్య శవాన్ని పాతి పెట్టారు. ఇక వారం రోజుల నుంచి ధైర్య కనిపించకపోవడంతో భవేష్ బావ వాల్జిబాయ్ దబోరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవేష్ పై అనుమానం ఉందని, ఇతనే ఏదో చేసి ఆ బాలికను చంపాడంటూ వాల్జిబాయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి భవేష్ ను విచారించగా మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక చివరికి తను చేసిన నిజం ఒప్పుకున్న తండ్రి భవేష్.. నా కూతురు ధైర్యకి అంటూ వ్యాధి సోకిందని, ఇది గ్రామస్తులెవరికీ సోకకూడదనే ముందు జాగ్రత్తతోనే నా కూతురిని హత్య చేసి పొలంలో పాతిపెట్టానంటూ ఓ కథ అల్లాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు ధైర్య తండ్రి భవేష్ ను అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.