ప్రతి తల్లిదండ్రులకు తమ బిడ్డలపైన ఎంతో ప్రేమ ఉంటుంది. ఏ కష్టం తెలియకుండా బిడ్డలను పెంచి పెద్ద చేస్తారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలపై ఉండే ప్రేమ కాస్తా ముదిరి.. ప్రాణాలు తీసుకోవడానికైనా, ప్రాణాలు తీయడానికైన సిద్ధపడుతుంటారు. అలాంటి ఘటనలు ఎన్నో మనం నిత్యం చూస్తుంటాము. తాజాగా తన కుమారుడికి విడాకులు ఇవ్వాలనుకున్న కోడల్ని తుపాకీతో కాల్చి.. మరీ చంపాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికాలో ఉంటున్న ఇండో అమెరికన్ సీతల్ సింగ్ దోసాంజ్(74) అనే వృద్ధుడు తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని భావించిందని కోడలు గురు ప్రీత్ కౌర్ దోసాంజ్ ను వెతికి మరీ కాల్చి చంపాడు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంజోస్ లో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి భర్త, ఆమె మామ సీతల్ సింగ్ ఫ్రెస్నోలో నివాసం ఉంటుండగా.. ఆమె శాంజోస్ లో ఉంటుంది. అక్కడే ఓ వాల్ మార్ట్ లో పనిచేస్తోంది. భర్తతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాలని భావించినట్లు సమాచారం. వారిద్దరి విడాకులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని మృతురాలి మేనమామ తెలిపారు.
ఈ క్రమంలోనే తన కొడుకు విడాకులు ఇవ్వాలని కోడలు భావిస్తుందనే వార్తను సీతల్ సింగ్ జీర్ణించుకోలేకపోయాడు. గురుప్రీత్ కౌర్ దోసాంజ్ ఓ వాల్ మార్ట్ లో పని చేస్తుండగా.. ఆమెను వెత్కుకుంటూ అక్కడి వెళ్లి..గన్ తో కాల్చి చంపినట్లు సమాచారం. ఈ దారుణానికి ముందు గుర్ ప్రీత్.. తన మేనమామతో ఫోన్ లో మాట్లాడింది. సీతల్..తనను చంపేందుకు వెతుకుతున్నాడని, తాను పని చేస్తున్న వాల్ మార్ట్ వద్దకి కూడా వచ్చాడని, భయంగా ఉందని గుర్ ప్రీత్.. తన మేనమామకు ఫోన్ లో చెప్పినట్లు అధికారులు తమ రిపోర్ట్ లో తెలిపారు. ఆమెను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం నుంచి వచ్చాడాని ఆయనకు వివరించింది. ఇలా తన పరిస్థితి గురించి చెబుతుండగానే ఆమెపై గన్ తో కాల్చాడు. గాయపడి పారిపోతున్న ఆమెను వెంటాడి మరీ చంపినట్లు సమాచారం. గుర్ ప్రీత్ చివరి మాటలు అవేనని.. ఆ తర్వాత ఫోన్ డిస్ కనెక్ట్ అయిపోందని పోలీసులు నివేదికలో తెలిపారు.