Kakinada: రోజురోజుకు ప్రేమోన్మాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమకు.. ఆకర్షణకు మధ్య తేడా తెలీకుండా ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ప్రేమించకపోతే చంపటానికైనా సిద్ధపడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా, కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించటం లేదన్న కోపంతో ఓ యువకుడు.. ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను అడ్డగించి కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ జిల్లాలోని కోరాడ గ్రామానికి చెందిన సూర్య నారాయణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన దేవకి అనే యువతిని ప్రేమించాడు. అయితే, అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో సూర్యనారాయణ.. దేవకిపై పగ పెంచుకున్నాడు.
తనకు దక్కని ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోరాడ నుంచి కాడ్రేగులకు స్కూటీపై వెళుతున్న ఆమెను దారి మధ్యలో అడ్డగించాడు. కత్తితో ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. దీంతో దేవకి అతడినుంచి తప్పించుకోవటానికి పరుగులు పెట్టింది. అయినా అతడు వదల్లేదు. వెంబడించి మరీ కత్తితో నరికాడు. కత్తి వేట్లకు ఆమె తీవ్రగాయాలపాలై రక్తపు మడుగుల్లో కుప్పకూలింది. దాడి అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. స్ప్రహలేకుండా పడిఉన్న దేవకిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: అందమైన యువతులే ఆ దంపతుల టార్గెట్! పక్కా ప్లాన్ తో నమ్మించి!