తనకు దక్కాల్సిన ప్రియుడ్ని మరో యువతి దక్కించుకుంటుందన్న కక్షతో ఓ యువతి దారుణానికి ఒడికట్టింది. ఈ దారుణానికి ప్రియుడు కూడా సహకరించడంతో పని సులువుగానే చేసిందా యువతి. ప్రియుడికి కాబోయే భార్యను చంపి.. పాతి పెట్టారు. ఇక వారిద్దరు ఏమీ ఎరగనట్లు వేరే ఊరికి వెళ్లి సహజీవనం చేస్తున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు చింతల్ పల్లి మిస్సింగ్ కేసుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి గోపాల్-లక్ష్మీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం జరిగిన మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ కేసులో కీలక విషయాలను ఏఎస్పీ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం సంపంగిపుట్టుకు చెందిన గోపాల్ కు జిమాడుగుల మండలం చిట్టంపుట్టుకు గ్రామానికి చెందిన లక్ష్మితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ గోపాల్ ఇంట్లో వీరి ప్రేమ విషయం తెలియడంతో.. గోపాల్ తల్లిదండ్రులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో గోపాల్-లక్ష్మిల మధ్య దూరం పెరిగింది. అదీ కాక గోపాల్ తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన కాంతమ్మతో పెళ్లి నిశ్చయించారు. దాంతో వీరిద్దరు చాలా సన్నిహితంగా మెలగసాగారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ ప్రియురాలు లక్ష్మి ఆగ్రహానికి లోనైంది. ఇదే విషయాన్ని అతడికి చెప్పడంతో.. ఇద్దరు కలిసి కాంతమ్మ అడ్డు తొలగించుకోవాలని చూశారు. అందులో భాగంగానే తమ పధకాన్ని పక్కాగా అమలు చేశారు.
ఈ క్రమంలోనే గత సంవత్సరం సెప్టెంబర్ 9 న గోపాల్-లక్ష్మిలు కలిసి గోపాల్ కు కాబోయే భార్య కాంతమ్మ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత లక్ష్మి తనను ఇంటి దగ్గర వదిలి రావాల్సిందిగా కోరింది. దాంతో ముగ్గురు కలిసి లక్ష్మి ఇంటి వెళ్లారు. లక్ష్మి కుటుంబ సభ్యులు వినాయక చవితి పూజకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు కాంతమ్మపై గొడ్డలితో దాడి చేశారు. గోపాల్ కాంతమ్మ నోరు, ముక్కు మూయగా.. లక్ష్మి గొడ్డలితో కసి తీరా నరికింది. కాంతమ్మ చనిపోయింది అని నిర్దారించుకున్న తర్వాత.. ఆమె మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే పాతి పెట్టారు. ఇక కాంతమ్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది జరిగిన కోన్ని రోజులకు గోపాల్-లక్ష్మి లు కోనసీమకు వెళ్లి అక్కడ ఉండసాగారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో తమదైన శైలిలో విచారించగా ఇద్దరు నిజాన్ని ఒప్పుకుని, కాంతమ్మను పాతి పెట్టిన స్థలాన్ని చూపించారు. దాంతో ఏడాది నుంచి మిస్టరీగా మారిన కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. గోపాల్-లక్ష్మి లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.