ఆ మహిళ వ్యాపారం చేయాలనుకుంది.. దానికి తన అందాన్నే పెట్టుబడిగా పెట్టింది. ఇంకేముంది వారి వ్యాపారం ఇప్పటి వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. ఇక్కడ మరో విశేషం ఏమింటంటే? ఇదంతా ఆ మాయలేడి భర్త పథకం ప్రకారం జరగడమే. తన అందాన్ని వలగా విసిరి ప్రముఖ రాజకీయ నాయకులను, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దించి.. తర్వాత తన అసలు రూపం చూపించేది. మోసపోయిన ప్రముఖులు తాము చేసిన ఘన కార్యం ఎక్కడ బయటపడుతుందో అని.. ఇప్పటి వరకు ఎవరూ ఆమెపై ఫిర్యాదు చేయలేదు. ఎట్టకేలకు ఓ సినీ నిర్మాత ఫిర్యాదు మేరకు ఆ మాయలేడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
భువనేశ్వర్ లోని ఖండగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ స్థానికంగా ఉండే ప్రముఖుల వివరాలను ఫేస్ బుక్ ద్వారా సేకరించి, వారితో పరిచయాలు పెంచుకునేది. ఆ మాయలేడి న్యాయశాస్ర్తంలో పట్టా పొంది ఉండటంతో, లా లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడుతూ వస్తోంది. అందులో భాగంగానే ప్రముఖులతో పరిచయాన్ని.. సన్నిహితంగా మార్చి.. వారిని తన ఇంటికి రమ్మనేది. ఇక ఇంటికి వచ్చిన ప్రముఖులను తన అందచందాలతో కవ్వించి.. సరసాలతో ముంచేత్తేది. అయితే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను, వీడియోలను వారికి తెలియకుండా తీసి, తర్వాత వాటిని బయట పెడతానని భారీగా డబ్బులు వసూలు చేసేది.
అయితే ఈ తతంగానికి ఆమె భర్త కూడా సహకరించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మాయలేడి జాబితాలో ప్రముఖ వ్యాపారులతో పాటు బడా రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఓ సినీ నిర్మాత ఆ కిలేడి చేతిలో మోసపోయాడు. అతడొక్కడే ధైర్యం చేసి ఖండగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ అమ్మడు అసలు రంగు బయటపడింది. ఈ దంపతులు 2021 నుంచి ఇదే పనిని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కేసుతో సంబంధం ఉండటం వల్లే ఈ కేసు గురించిన మరింత సమాచారాన్ని పోలీసులు వెల్లడించడం లేదని అక్కడి వారి వాదన.