వారంతా మరి కొన్ని గంటలు గడిస్తే.. గమ్య స్థానాలకు చేరతారు. అదే నమ్మకంతో ఆదమరిచి నిద్రిస్తున్నారు. అయితే మృత్యువు కంటైనర్ రూపంలో వారిని పలకరిస్తుందని అప్పుడు తెలియదు. నిద్రపోయిన వారు నిద్రపోతున్నట్లే మృతి చెందారు. బస్సు.. కంటైనర్‌ని ఢీకొనడంతో.. భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ర నాసిక్‌లో చోటు చేసుకుంది. డీజిల్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 11 మంది సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సు శుక్రవారం రాత్రి యవత్మాల్ నుంచి నాసిక్ వైపు ప్రయాణికులతో బయలు దేరింది. అయితే శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమంలో నాసిక్-ఔరంగాబాద్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ చిల్లీ చౌక్ వద్ద అదుపుతప్పిన బస్సు.. పక్కనే ఉన్న డీజిల్ కంటైనర్‌ని ఢీకొట్టింది. దీంతో లారీలోని డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయింది. ఈ క్రమంలో మంటలు బస్సును తాకాయి. ఇక ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. వారికి మెలకువ వచ్చేసరికి.. బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్పటికే 11 మంది బస్సులోనే సజీవ దహనం అయ్యారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి.. ప్రయాణికులను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 38 మంది వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే వీరిలో పలువరు పరిస్థితి విషమంగా ఉందని.. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.