మొన్నా మధ్య కారు రోడ్డు మీద పార్కింగ్ చేసిందని ఒక ట్రాఫిక్ పోలీస్ చలానా వేశారని.. కారు ఓనరమ్మ ట్రాఫిక్ పోలీస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నా కారుకే చలానా వేస్తావా అంటూ ట్రాఫిక్ పోలీసుపై మీడియా మిత్రుల సమక్షంలోనే ఎగిరెగిరి పడ్డారు. గతంలో కూడా కారు ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేశాడో వ్యక్తి. ఇలా తవ్వుకుంటూ వెనక్కి వెళ్తే.. పోలీసుల మీద వాహనదారులు, వాహనదారుల మీద ట్రాఫిక్ పోలీసులు దాడులు చేసుకునే ఘటనలు చాలానే ఉంటాయి. అయితే తెలంగాణాలో ట్రాఫిక్ రూల్స్ ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినా, రాంగ్ రూట్ లో వచ్చినా భారీగా చలానా వసూలు చేస్తున్నారు.
ఇవాళ్టి నుంచే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉల్లఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని కూడా ప్రకటించారు. అయితే కొంతమంది మాత్రం ‘ఏ వీళ్ళు అలానే అంటారు. మనల్ని ఎవడ్రా ఆపేది’ అన్న చందాన ఇష్టా రాజ్యంగా డ్రైవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ అనే వ్యక్తిని రాంగ్ రూట్ లో వస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో ఆ వ్యక్తి తన బైక్ ని పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నాడు. మైత్రీవనం దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఎల్లారెడ్డిగూడ నుంచి రాంగ్ రూట్ లో వస్తున్నాడని అశోక్ ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. రాంగ్ రూట్ లో రావడం తప్పని వారించారు. దీనికి ఇంగ్లీష్ లో సారీనో, తెలుగులో క్షమించండి అని చెప్పేస్తే అయిపోయేది.
కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో పోలీసులు అతనికి చలానా విధించారు. చలానా విధించారన్న కోపంతో.. తన బైక్ లో ఉన్న పెట్రోల్ బయటకు తీసి బైక్ పై పోసి తగలబెట్టుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పోలీసులు అశోక్ ని అదుపులోకి తీసుకున్నారు. “చేసిన తప్పు తప్పు అని ఒప్పుకుంటే బైక్ మిగిలేది. ఇక చలానా కూడా జీవితం కన్నా తక్కువే కాబట్టి కట్టేస్తే అయిపోయేది. ఇప్పుడు బైకూ పోయింది. స్టేషన్ కెళ్ళాల్సి వచ్చింది. ఎందుకొచ్చిన కర్మ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.