దేవుడి తర్వాత వైద్యుడిని అందరూ దైవ్యంగా కొలుస్తుంటారు. వాస్తవానికి వారు చేసే సేవ వెలకట్టలేనిదనే చెప్పాలి. చనిపోయే వ్యక్తికి ప్రాణబిక్ష పెడుతూ ఊపిరిపోస్తుంటారు. అయితే కొంతమంది వైద్యులు మాత్రం వైద్యం ముసుగుతొడిగి అందినకాడికి దోచుకుంటున్నారు. ఠాగూర్ సినిమాలో ఓ వ్యక్తి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే అతను చనిపోయినా కూడా బతికున్నాడని నమ్మిస్తూ లక్షలు వసూలు చేస్తుంటారు. అదే రీల్ సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో మరోసారి రిపీట్ అయింది.
తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? నగరంలోని సబ్జి మండిలో జై కిషన్ గంగపుత్ర(54), రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ టీచర్ గా పని చేస్తోంది. అయితే గత 15 రోజుల కిందట రాజ్యలక్ష్మి భర్త జై కిషన్ గంగపుత్ర కడుపు నొప్పితో బాధపడుతూ మోహదీపట్నంలోని ప్రీమియర్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స అందిస్తూ వచ్చిన వైద్యులు 15 రోజుల తర్వాత అతను మరణించాడని తెలిపాడు. ఈ వార్త విన్న అతని భార్య రాజ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురై కోపంతో ఊగిపోయారు.
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే నా భర్త మరణించాడని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గత 15 రోజుల నుంచి బతికున్నాడని నమ్మిస్తూ ఆస్పత్రి వైద్యులు.. దాదాపుగా రూ.16 లక్షలు వసూలు చేశారని కిషన్ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వ మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.