ప్రేమ, పెళ్లి అనేది ఇద్దరి మనసులు కలిస్తేనే జరుగుతుంది. ఇష్టం లేకుండా చేస్తే ఆ బంధాలు నిలవవు. కానీ నేటి కాలంలో ప్రేమ పేరు చెప్పి.. వెంటపడటం.. ఒప్పుకోకపోతే.. బలవంతంగా కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇలాంటి నేరాలకు పాల్పుడుతున్న వారిలో యువతులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కర్ణాటక, బెంగళూరులో చోటు చేసుకుంది. గూగుల్‌లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న యువకుడికి ప్రేమ పేరుతో దగ్గరయ్యింది ఓ యువతి. ఓ రోజు ఇంటికి పిలిచింది. కుటుంబ సభ్యులందరూ కలిసి.. సాదరంగా ఆహ్వానించారు. వారు చేసిన మర్యాదలు చూసి మురిసిపోయాడు. అక్కడే అతడు తప్పులో కాలేశాడు. ఈ క్రమంలో ఆ యువతి కుటుంబ సభ్యులు.. అతడికి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత గదిలో బంధించి.. యువతితో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత తనకు 40 లక్షల రూపాయలు ఇస్తేనే.. విడిచిపెడతానని బెదిరించింది యువతి. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన గణేశ్ శంకర్ గూగుల్ ఇండియా సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడు షిల్లాంగ్ ఐఐఎంలో ఎంబీఏ చదువుతున్న సమయంలో భోపాల్‌కు చెందిన.. సుజాత అనే యువతితో శంకర్‌కు పరియం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఐదేళ్లుగా వారు లవ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శంకర్.. యువతిని కలవడానికి.. భోపాల్ వెళ్లాడు. సుజాత తల్లిదండ్రులు.. అతడిని సాదారంగా ఆహ్వానించారు. బాగా మర్యాదలు చేశారు. ఆఖరికి అతడికి మత్తు మందు ఇచ్చి.. ఓ చీకటి గదిలో బంధించారు. ఆ తర్వాత గణేశ్‌ను బెదిరించి ఆ యువతితో పెళ్లి చేసి ఫోటోలు తీశారు.
ఆ తర్వాత తమకు 40 లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వారి భారి నుంచి ఎలాగో అలా తప్పించుకున్న శంకర్.. భోపాల్‌లోని కమలా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సుజాత, ఆమె తండ్రి కమలేశ్‌సింఘ, సోదరుడు శైవేశ్‌సింగ్, విజేంద్రకుమార్ పై వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా యువతి తల్లిదండ్రుల వాదన మరో విధంగా ఉంది. సుజాత తల్లిదండ్రులు కూడా శంకర్ మీద ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెని ప్రేమించానని చెప్పిన శంకర్.. తమ బిడ్డకు తెలియకుండా వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. శంకర్ తమను మోసం చేశాడని బెంగళూరులో ఫిర్యాదు చేశారు యువతి కుటుంబ సభ్యులు.