గుజరాత్ మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపరిచారు. మచ్చు నదిపై వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఒరెవా కంపెనీని ప్రాసిక్యూటర్ తప్పుబట్టారు. మరమ్మత్తు పనులకు ఒరెవా కంపెనీకి అర్హత, అనుభవం లేకపోయినా.. కంపెనీ వంతెన పునరుద్ధరణ పనులకు పూనుకుందని.. 2007, 2022 సంవత్సరాల్లో వంతెన మరమ్మత్తు పనులకు కాంట్రాక్టు తీసుకున్నట్లు మోర్బీ నగర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టుకు నివేదికలు సమర్పించారు. వంతెన మరమ్మత్తు సమయంలో ఫ్లోరింగ్ మార్చారని, నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోరింగ్ వేశారని అన్నారు.
అయితే అరిగిపోయిన వంతెన తీగలను తొలగించి కొత్త తీగలను అమర్చలేదని, పాత తీగలను అలానే ఉంచారని, ఈ కారణంగా ఫ్లోరింగ్ బరువు ఎక్కువై వంతెన తీగలు తెగిపోయాయని కోర్టు ముందు వెల్లడించారు. అల్యూమినియం ఫ్లోర్ బరువుని పాత తీగలు మోయలేకపోవడం వల్లే తెగిపోయి వంతెన కూలిపోయిందని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెల్లడైన విషయాన్ని కోర్టులో తెలిపారు. దీనిపై నిందితుల్లో ఒకరైన ఒరెవా కంపెనీ మేనేజర్ దీపక్ ఫరేఖ్ ఈ వంతెన ప్రమాదంలో తమ ప్రమేయం ఏ మాత్రం లేదని, ఇది పూర్తిగా దేవుని చిత్తమే అంటూ కోర్టుకు తెలిపారు.
అయితే ఈ దురదృష్టకర ఘటన జరగకుండా ఉండాల్సిందని దీపక్ అన్నారు. విచారణ అనంతరం 9 మంది నిందితుల్లో నలుగురికి పోలీస్ కస్టడీకి, మిగతా ఐదుగురికి జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది నలుగురిలో ఒరెవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. కాగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ఘటన దైవ నిర్ణయం అని ఒరెవా సంస్థ మేనేజర్ దీపక్ అనడం అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది.