ఈ సంవత్సరం డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ బాగా క్షీణించింది. ఈ క్రమంలో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని పలువురు ఆర్ధిక నిపులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల నుంచి డాలర్ విలువ పెరుగుతూ వస్తోంది. రూపాయి విలువ తగ్గుతుందని, ఆర్ధిక వ్యవస్థలోని పలు సమస్యలే ఇందుకు కారణమని కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఈ ఏడాది డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ 8 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి బలహీనపడటం లేదని, డాలర్ విలువే బలపడుతోందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF), ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన వార్షిక సమావేశాల్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ వార్షిక సమావేశాల కోసం నిర్మలా సీతారామన్ అమెరికా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో వివిధ దేశాల ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ఆర్ధిక మంత్రి భారత్ ఆర్ధిక వ్యవస్థ, రూపాయి విలువకు సంబంధించి పలు అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రూపాయి బలహీనపడటం లేదని, డాలర్ విలువే పెరుగుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలీస్తే భారత్ లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది.
అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్లనే పలు దేశాల్లోని ఆర్ధిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి విలువను నిర్దేశించడం లేదు. కేవలం ఒడుదొడుకులను తగ్గించేందు మాత్రమే పయత్నిస్తోంది” అని ఆమె స్పష్టం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ ధర భారీగా పెరగడం, సప్లయ్ లో అనిశ్చితి నేపథ్యంలో వివిధ అవసరాలకు మళ్లీ బొగ్గు వినియోగం పెరగొచ్చన్ని తెలిపారు. డేటా గోప్యతను దెబ్బతీసే స్వామింగ్ వంటి కార్యకలాపాలపై భారత్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోన్నట్లు ఆమె తెలిపారు. ఈ డేటా గోప్యత కోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆర్ధికమంత్రి వెల్లడించారు.