బ్యాంకులలో డిపాజిట్ల రూపంలో డబ్బులు దాచుకున్న వారికి శుభగడియలు నడుస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా, ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లను అక్టోబర్ 14, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబరు 30, 2022న జరిగిన మానిటరీ పాలసీలో ఆర్బీఐ రేపో రేటును 5.90%కి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు సహా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 75 బీపీఎస్ వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్లను అక్టోబర్ 14, 2022 నుంచి అమలులోకి రానున్నాయి.
7 రోజుల నుంచి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై కనీస వడ్డీ రేటును 2.75 శాతం నుంచి 3.50 శాతానికి, 30 రోజుల నుంచి 60 రోజుల వ్యవధిలోని డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. అలాగే 61 రోజుల నుంచి 3 నెలల కాల వ్యవధిలోని డిపాజిట్లకు 4 శాతం, మూడు నెలల నుంచి 6 నెలల వ్యవధిలోని డిపాజిట్లను 4.25 శాతానికి పెంచింది. ఇక 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5 శాతం, 10 నెలల నుంచి ఏడాది వరకున్న డిపాజిట్లపై 5 శాతం, ఏడాది నుంచి ఏడాది 11 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.10 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇక ఏడాది 11 రోజుల నుంచి ఏడాది 25 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.10 శాతం, ఏడాది 25 రోజుల నుంచి 15 నెలల మధ్యలోని డిపాజిట్లపై 6.10 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే.. 15 నెలల నుంచి రెండేళ్ల వరకున్న డిపాజిట్లపై 6.15 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.20 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్యలో కాలం చేసే డిపాజిట్లపై వడ్డీ రేటు 5.75 శాతం నుంచి 6.10 శాతం పెరిగింది. సీనియర్ సిటిజన్లకు ఈ డిపాజిట్లన్నింటిపై అదనపు వడ్డీ రేటు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో అత్యధికంగా రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 6.95 శాతం వడ్డీ రేటును పొందుతారు.