బిగ్ బాస్ 6 సీజన్ కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. ఒకరి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలతో పని లేకుండా బిగ్ బాస్ షో బుల్లితెర మీద బాగానే ఆడిస్తుంది. నెటిజన్లు, విమర్శకులు షోని ఎంత ఆడుకుంటున్నా గానీ షో మాత్రం వేరే లెవల్ లో ఆడుతుంది. షోలో కంటిస్టెంట్లు ఏమైనా తక్కువ తిన్నారా. వారు కూడా పెర్ఫార్మెన్సులు బాగానే ఇస్తున్నారు. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ షో గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. మొదటి 4 సీజన్లు హుందాగా సాగినా.. ఇప్పుడు ఆ హుందాతనం కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన.. రాజు నువ్వే, బంటు నువ్వే అన్నట్టు.. ఎవరెన్ని తిట్టుకున్నా బిగ్ బాస్ మాత్రం తానే జడ్జి, తానే లాయర్ అన్నట్టు సాగిపోతారు. చూసే ప్రేక్షకులను బట్టే షో కూడా ఉంటుందిలెండి.
ఇకపోతే.. అప్పుడప్పుడు చూసే వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు, షోపై ఆసక్తి కలిగేలా మధ్య మధ్యలో గెస్ట్ లు వస్తుంటారు. అలానే ఇప్పుడు ఈ షోకి కళ, అందం తెచ్చేందుకు సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఆ అనుకుంటున్నారు. బయట టాక్ అంతే. బిగ్ బాస్ షోలో చూసిన మొఖాలనే చూడాలంటే ఎప్పుడూ చూసే ప్రేక్షకులకైనా బోర్ కొడుతుంది. అందుకే మధ్య మధ్యలో గెస్ట్ లని పిలిచి హౌస్ లో ఉన్న సభ్యులతో పాటు.. చూసే ప్రేక్షకులని కూడా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ కి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో షో రసవత్తరంగా సాగడమే కాకుండా.. రేటింగ్ కూడా బాగా వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ.. సుధీర్ వస్తే గనుక హౌజ్ లో రచ్చ రచ్చే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.