మరణం అనేది మనిషిని తీవ్ర దుఃఖంలో పడేస్తుంది. అప్పటి వరకూ కళ్ల ముందు తిరిగిన వాళ్ళు ఒక్కసారిగా కనిపించకుండా వెళ్ళిపోతే ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. ఇక సినిమా వాళ్ళ విషయానికొస్తే సినిమా వాళ్ళని ఆత్మీయులుగా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. రీసెంట్ గా టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం యావత్ సినీ, ప్రేక్షక లోకాలని కలచివేసింది. ఆయనను ఆరాధించే అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సినీ ప్రముఖులైతే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక మాహా వృక్షం ఒరిగిపోయిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. చచ్చేలోపు నలుగురిని సంపాదించుకోవాలని అంటారు పెద్దలు.
సినిమా వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో గానీ సినిమా వాళ్ళుగా పుట్టి.. నలుగురిని కాదు.. దేశం నలుదిక్కులా ఉన్న లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంటారు. అందుకే కాబోలు వీరు మరణిస్తే సొంత వాళ్ళని కోల్పోయామన్న బాధని వ్యక్తపరుస్తారు. తాజాగా ప్రముఖ నిర్మాత, ప్రముఖ నటుడు, ప్రముఖ వ్యాపారవేత్త మృతి సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. మొదట బ్యాంకులో పని చేశారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ బంగారు ఆభరణాల స్టోర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. సినిమాల్లో, రియల్ ఎస్టేట్ లో, హెల్త్ కేర్ రంగాల్లో ఇలా అడుగుపెట్టిన చోటల్లా సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ కాలం కాటేయడంతో వచ్చిన ప్రతిష్ట అంతా ఒక్కసారిగా పోయింది. జైలుకెళ్లాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకి చెందిన ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త అయినటువంటి అట్లాస్ రామచంద్రన్ (80) గుండెపోటుతో మృతి చెందారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామచంద్రన్.. ఇటీవల గుండె నొప్పితో దుబాయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 1942లో కేరళలోని త్రిస్పూర్ లో జన్మించిన ఎంఎం రామచంద్రన్.. బిజినెస్ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. 1981లో కువైట్ లో ‘అట్లాస్ జ్యూవెల్లరీ ఇండియా లిమిటెడ్’ సంస్థను స్థాపించి.. ఆ తర్వాత ఒమన్, కతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు.
యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 41 స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్స్ లో బంగారం, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు వంటివి దొరుకుతాయి. ఇండియాలో కూడా ఈ సంస్థ బ్రాంచ్ ఉంది. కేరళలో ఈ అట్లాస్ జ్యూవెల్లరీకి మంచి డిమాండ్ ఉంది. ఈయన ఎన్ఆర్ఐ. దుబాయ్ లోనే ఎక్కువ గడిపారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీజీ చేసిన ఈయన కెనరా బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంక్ లో పని చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 100 బ్రాంచుల్లో సూపరింటెండెంట్ గా పని చేశారు. ఆ తర్వాత కువైట్ వెళ్లి.. బంగారు ఆభరణాలకు గిరాకీ ఉందని గుర్తించి.. అట్లాస్ సంస్థను స్థాపించారు. అడ్వర్టైజింగ్ రంగంలోనూ ఈయన తన సత్తా చాటారు. సినిమా, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ రంగాల్లో కూడా అట్లాస్ గ్రూప్ అడుగుపెట్టి సత్తా చాటింది.
చంద్రకాంత్ ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి.. మలయాళంలో వైశాలి, సుకృతమ్, వస్తుహర, దానం వంటి హిట్ సినిమాలను ఈయన నిర్మించారు. అంతేకాదు నటుడిగా పలు సినిమాల్లో కూడా నటించారు. అరబి కథ, మలబార్ వెడ్డింగ్, హరిహర్ నగర్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈయన ప్రతిష్ట ఒక్కసారిగా నేలకొరిగింది. 2015లో ఓ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో రామచంద్రన్ అరెస్ట్ అయ్యారు. మూడేళ్ళ పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈయనకి భార్య ఇందిర, మంజు, శ్రీకాంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనవుతున్నారు. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్టించాలని భగవంతుడ్ని కోరుకుందాం. ఓం శాంతి..