పేద ప్రజలకు మేలు చేకూరే విధంగా రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ కింద 3,254 ప్రొసీజర్లకు పెంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. ఆరోగ్య శ్రీని ప్రారంభించిన కొత్తలో దీనిలో 942 ప్రొసీజర్స్ ఉండేవి. ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి 1059 ఉన్న ప్రొసీజర్స్‌ను 2,446కు పెంచారు. తాజాగా ఈ నెల 15 నుంచి 3,254 ప్రొసీజర్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కేవలం 117 ప్రొసీజర్లు మాత్రమే పెంచిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఏటా 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని, గత మూడేళ్లలో 6 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. హై ఎండ్ ప్రొసీజర్స్‌కి అదనంగా అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు విడదల రజని స్పష్టం చేశారు. గతంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. మన్యం జిల్లాతో కలిపి మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు రూ.8 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు పెడితే.. ఆ మొత్తం రూ.632 కోట్లను తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని.. దానిలో భాగంగానే వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, తల్లీ, బిడ్డ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తదితర వాటిని ఏర్పాటు చేసిందని తెలిపారు. వీటి ద్వారా మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. క్యాన్సర్‌కి కూడా అత్యుత్తమ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రజని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్యం అందించడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.