టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించాడు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభం అయ్యింది. శనివారం యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజున కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా.. లోకేష్ గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
లోకేష్.. బెగ్గిపల్లి గ్రామస్తులతో ముచ్చటిస్తుండగా.. ఓ యువజంట.. చేతిలో మూడు నెలల చంటి బిడ్డతో అక్కడకు వచ్చారు. వీరు కుప్పం మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్, అశ్వని దంపతులు. అనంతరం లోకేష్.. వారిని తన వద్దకు పిలిపించుకుని కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రిషికేష్ దంపతులు కోరిక మేరకు లోకేష్.. చంటిబిడ్డకు పేరు పెట్టాడు. చిన్నారిని ముద్దాడి ఆశీర్వదించాడు. చిన్నారికి సాన్విత అని నామకరణం చేశారు.ఆ తర్వాత పాదయాత్ర కొనసాగించారు.
అనంతరం లోకేష్ పాదయాత్రలో భాగంగా గణేష్ పురం క్రాస్ రోడ్‌లో మహిళలు, స్థానిక రైతులతో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి బతుకు భారం అవుతుందని.. అంతేకాక ప్రభుత్వం బలవంతంగా తమ మోటార్లకు మీటర్లు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ వారి సమస్యలు తెలుసుకుని.. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అని హామీ ఇచ్చాడు.