ఏపీలో ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా యాత్రలు, పలకరింపులు కూడా ప్రారంభించేశారు. ఈసారి తమ టార్గెట్ 175 సీట్లు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే జగన్ ప్రత్యేకంగా రాయలసీమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీమలో తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చూసుకోవాలంటూ నేతలకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారట జగన్.
సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమపై ఇంత నమ్మకంగా ఉండటానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ దక్కించుకున్నది కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మాత్రమే. ఆ ఎన్నికల్లో జగన్ హవా ముందు “కోట్లా, పరిటాల, జేసీ, కేఈ” వంటి కుటుంబాలే నిలవలేకపోయాయి. ఈ నమ్మకంతోనే జగన్ మరోసారి రాయలసీమని చుట్టేయాలని చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని వైసీపీ సొంతం చేసుకుంది. దీంతో.. జగన్ నమ్మకం మరింత పెరిగింది. ఇలా రాయలసీమలో వాతావరణం అంతా వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నా.., ఆ పార్టీ నేతలకు మాత్రం హిందూపురం నియోజకవర్గం కలవరపాటుకి గురి చేస్తోందట. గత రెండు ఎన్నికల నుండి హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ అడ్డాగా మారిపోయింది. అక్కడ బాలయ్య మాటే వేదవాక్కు. 2019లో అంతటి జగన్ ప్రభంజనంలో కూడా బాలకృష్ణ మంచి మెజారిటీతో విజయం సాదించారంటే హిందూపురంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు హిందూపురం కోసం ఎమ్మెల్యేగా బాలకృష్ణ కూడా అంతే స్థాయిలో కష్టపడుతూ ఉంటారు. హిందూపురంని జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్య ధర్నాకి దిగిన విషయాన్ని ఎవ్వరూ మరచిపోలేరు. దశాబ్దాలుగా హిందూపురంలో పేరుకుపోయిన సమస్యలు బాలయ్య వచ్చాకే పరిష్కారం అయ్యాయి. స్టార్ హీరోగా, బసవతారకం హాస్పిటల్ ఛైర్మెన్ గా బాలయ్య ఎంత బిజీగా ఉన్నా బాలయ్య ఏనాడూ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా లేరు. కరోనాకి గురి కాకముందు కూడా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు, మంచిచెడులు తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఇలా సినిమాలు, రాజకీయాలను సమన్వయం చేసుకుంటున్నారు కాబట్టే హిందూపురంలో బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు. తాజాగా వైసీపీ చేసుకున్న అంతర్గత సర్వే కూడా హిందూపురంలో బాలయ్య గెలుపు ఖాయమని తేల్చి చెప్పిందట. దీంతో.. ఇక్కడ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి.. హిందూపురంలో బాలయ్యని ఓడించడం వైసీపీకి సాధ్యమేనా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.