ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తుండగా ఆయనపై ఒక దుండగుడు రాయి విసిరాడు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులు వైసీపీ వాళ్ళే అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబుపై దాడి చేసే అవసరం వైసీపీ పార్టీకి ఏ మాత్రం లేదని వెల్లడించారు. తన మీద తానే రాళ్లు వేయించుకున్నాడని, కొత్త నాటకానికి ప్రేరేపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శలు చేశారు.
ఈ దాడిలో పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని అన్నారు. తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి క్షమాపణలు చెప్పాల్సిన మొదటి వ్యక్తి చంద్రబాబేనని అన్నారు. ఇతరుల మీద రాళ్లు వేసే కర్మ, అవసరం తమ పార్టీ నేతలకు గానీ, కార్యకర్తలకు గానీ లేదని అన్నారు. జగన్ అక్రమంగా జైల్లో పెట్టినప్పుడే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుచరులు ఎలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడలేదని, శాంతియుతంగానే పోరాటం చేశామని గుర్తు చేశారు. అందుకే ప్రజలు తమకి 151 స్థానాలు కట్టబెట్టారని అన్నారు. ఇప్పుడు మా లక్ష్యం 151 నుంచి 175 స్థానాలే తప్ప.. చంద్రబాబు మీదనో, ఇంకెవరి మీదనో రాళ్లు విసరడం తమ లక్ష్యం కాదని అన్నారు. అది పసుపు రాయో, ఇంకే రంగు రాయో, విసిరింది ఎవరో తేలుస్తామని అన్నారు.