సాధారణంగా తిరుమల మెట్లు నడిచి ఎక్కడం అంటే చాలా కష్టం. అందులోనూ భుజాన బరువు మోస్తూ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒకతను తన భార్యని భుజాన ఎత్తుకుని తిరుమల మెట్లు ఎక్కారు. ఒకటి, రెండు మెట్లు అనుకున్నారేమో. కాదండి బాబు 70 మెట్లు ఎక్కారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో కూడా ఉండవేమో. ఉన్నా గానీ రోప్ సహాయంతోనో, డూప్ సహాయంతోనే కానిచ్చేస్తారు. కానీ ఇతను మాత్రం రియల్ బాహుబలిలా తన భార్యని భుజాన మోస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఇతను తన భార్యకు ప్రాధాన్యత ఇస్తూ.. ఆమెను మోస్తూ తిరుమల మెట్లు ఎక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అసలు మేటర్ లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన వరదా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) లారీ ట్రాన్స్పోర్ట్ యజమానిగా పని చేస్తున్నారు. ఈయన తన భార్య లావణ్యతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారు. ఈ క్రమంలో సత్తిబాబు వేగంగా మెట్లు ఎక్కుతుంటే.. ఆయన భార్య లావణ్య మాత్రం నెమ్మదిగా ఎక్కుతున్నారు. దీంతో త్వరగా ఎక్కు అని కంగారు పెట్టే సరికి ఆమె. “మీరు ఎక్కడం కాదు, నన్ను ఎత్తుకుని ఎక్కండి” అంటూ సరదాగా ఛాలెంజ్ విసిరారు లావణ్య. దీన్ని సిల్లీ సాస్ గా (సిల్లీ సీరియస్ నెస్) తీసుకున్న సత్తిబాబు.. వెంటనే తన భార్యను వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కైరా అద్వానీని ఎత్తుకున్నట్టు.. భుజాన ఎత్తుకుని తిరుమల మెట్లు ఎక్కడ స్టార్ట్ చేశారు.
అలా 70 మెట్లు ఎక్కుతూ భార్యని తిరుమల కొండపైకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “మా సీత తిరుమల శ్రీవారి మెట్టుకి వెళ్ళేటప్పుడు సరదాగా చిన్న పందెం” అంటూ రాసుకొచ్చారు. మామూలుగా ఎవరైనా ఏదైనా సాధిస్తే ఒక మెట్టు ఎక్కేశాడు అని అంటారు కదా. అలా ఈ సత్తిబాబు కూడా ఒక మెట్టు ఎక్కేశారు. తిరుమల మెట్లే కాదు, భార్యని గౌరవించే భర్తగా శిఖరమంత ఎత్తైన మెట్టు ఎక్కేసారు. ఒక బాహుబలి, ఒక వినయ విధేయ రామ కలిపితే ఈ సత్తిబాబు. బాహుబలిలో దేవసేనని తన భుజాల మీద ఎక్కించుకుని పడవ ఎక్కేలా సహకరిస్తాడు బాహుబలి. వినయ విధేయ రామలో సీతని గంట కొట్టేందుకు తన అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తుతాడు రామ్.
ఈ రెండు సీన్స్ లో హీరోలు తాము ప్రేమించిన వారికి విలువ ఇచ్చారు. అలా ఈ సత్తిబాబు కూడా తాను ఎంతగానో ప్రేమించే భార్య లావణ్యకి విలువ ఇచ్చారు. పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇలానే చేస్తారు అని అనుకోకండి. వీరికి పెళ్లై 20 ఏళ్లు పైనే అవుతుందట. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట. వారికి పెళ్లిళ్లు కూడా అయిపోయాయట. సత్తిబాబు అల్లుడు, పెద్ద కూతురు భర్త గురుదత్త (చందు) తనకి సాఫ్ట్ వేర్ జాబ్ వస్తే తన కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారట. ఈ క్రమంలోనే చందు మామగారు సత్తిబాబు ఇలా ఆయన భార్యని భుజాన ఎక్కించుకుని తిరుమల మెట్లు ఎక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
A post shared by Sattibabu Kadiyapulanka (@sattibabu222228kadiyapulanka)