మతం అనేది దేవుడ్ని చేరుకునే మార్గం మాత్రమే. భౌతిక రూపంగా మనుషులు వేరైనా ఆత్మలుగా అందరం ఒకటే. మతసామరస్యం అనే మాట మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన మతం కాదు, మన దేవుడు కాదు, మన మనుషులు కాదు, మనది కాదు అనుకుని బతికే సొసైటీ ఆఫ్ ఇండియాలో అంతా మనవాళ్లే అని బతికే మనుషులు కూడా ఉంటారు. అందరి దైవం ఒకటే, మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం అని ఆదర్శంగా జీవిస్తుంటారు. అలాంటి వారిలో అజీజ్ హిరాణీ అనే వ్యక్తి ఒకరు. ఈయన తన కూతురు త్వరలో ఉద్యోగంలో చేరబోతున్న ఆనందంలో తన దగ్గర పని చేసే కూలీలను ప్రత్యేకంగా విమానంలో తీసుకెళ్లి మరీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు.
వివరాల్లోకి వెళ్తే.. అజీజ్ హిరాణీ ఒక ముస్లిం వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కిరాణా షాపు నడుపుతున్నారు. ఈయన దగ్గర 15 మంది నిరుపేద దళిత, ఆదివాసీ వ్యక్తులు కూలీలుగా పని చేస్తున్నారు. అయితే అజీజ్ కుమార్తె అప్రాణి ఆస్ట్రేలియాలో పైలట్ గా శిక్షణ పూర్తి చేసుకుని.. త్వరలోనే ఉద్యోగంలో చేరబోతోంది. ఈ శుభ సందర్భంగా తన దగ్గర పని చేసే కూలీలకు ఏదైనా చేయాలని అనుకున్నారు అజీజ్. తన కుమార్తె కల నెరవేరిన సంతోషాన్ని తన కూలీలతో పంచుకున్నారు. 15 మంది కూలీలను హైదరాబాద్ నుంచి తిరుపతికి సొంత ఖర్చుతో విమానంలో తీసుకెళ్లి దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు.
ఆ తర్వాత పలు రిసార్టులకు కూడా తీసుకెళ్లారు. తమ యజమాని మంచి మనసుకి కూలీలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారికి ఎప్పటి నుంచో తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలన్న కోరిక ఉండి నిరుపేదలు కావడంతో దర్శించుకోలేకపోవడం అజీజ్ గమనించారో లేక ఆయనే స్వయంగా అనుకుని శ్రీవారి దర్శనం చేయించాలని అనుకున్నారో తెలియదు గానీ ముస్లిం వ్యక్తి అయి ఉండి, పరమత దైవ దర్శనానికి దగ్గరుండి విమానంలో తీసుకెళ్లడం అనేది గొప్ప విషయం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. మామూలుగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే.. వారి దగ్గర పని చేసే వారికి బోనస్ ఇవ్వడం, బట్టలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ అజీజ్ తన సొంత ఖర్చుతో తన వద్ద పని చేసే వారిని విమానంలో సొంత ఖర్చుతో తిరుపతి తీసుకెళ్లడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.