నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుడ్నే.. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసుల్నే. అంత పవర్ ఫుల్ పొజిషన్ ఉన్న పోలీసులు మనుషులకి నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి. పోలీసులు వస్తుంటే సూపర్ హీరోలు వస్తున్నారన్న అనుభూతి కలగాలి. అంతేగానీ వామ్మో పోలీసులు వస్తున్నారురా పారిపోండిరా అని భయపడేలా ప్రవర్తించకూడదు. పోలీసులంటే భయాన్ని పోగొట్టే వాళ్ళు అవ్వాలి గానీ భయపెట్టే వాళ్ళు కాకూడదు. కొంతమంది పోలీసుల తీరు బాగుంటుంది. జనం పట్ల స్నేహభావంతో ఉంటారు. కొంతమంది మాత్రం జనాన్ని చిన్న చూపు చూస్తారు. పై నుంచి ఊడిపడినట్టే ఫీలవుతుంటారు. జనానికి గౌరవం ఇవ్వరు. ఏ తప్పూ చేయని వాళ్ళని కూడా తప్పు చేసిన వాళ్ళలా చూస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా పోలీసులకి చెడ్డ పేరు వస్తుంది.
తాజాగా ఒక పోలీస్ చేసిన పని ఇప్పుడు పోలీసులను తలదించుకునేలా చేసింది. మహిళా పోలీస్ అయి ఉండి మహిళ అని చూడకుండా ఒకామెను రాత్రి పూట బలవంతంగా కొట్టి పోలీస్ వాహనంలో ఎక్కించింది. మహిళ పట్ల సదరు మహిళా పోలీస్ ప్రవర్తించిన అమానుష తీరు అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్.. రాత్రి సమయంలో హోటల్ నడుపుతున్న మహిళ దగ్గరకు వెళ్లి ఆమె భర్త ఆచూకీ తెలపాలని అడిగింది. అయితే తన భర్త ఎక్కడున్నాడో తనకు తెలియదని సదరు మహిళ జవాబిచ్చింది. అంతే కోపంతో మహిళపై దాడికి దిగింది. నడి రోడ్డు మీద ఆ మహిళను బూతులు తిడుతూ, కొడుతూ కర్కశంగా ప్రవర్తించింది. ఆమె చీర ఊడేలా ఆమెను కొట్టి బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించింది.
మా అమ్మకి ఆపరేషన్ అయ్యింది, కొట్టకండని ఒకవైపు ఆమె కొడుకు వేడుకుంటున్నప్పటికీ.. వినకుండా తన పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిందని, బూటు కాలితో తన్నిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి సమయంలో తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని వాపోయింది. ప్రస్తుతం ఆ మహిళ రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇదిలా ఉంటే సీఐ అంజు యాదవ్ గత కొంత కాలంగా తనను వేధిస్తోందని బాధిత మహిళ భర్త హరి ఆరోపించారు. ఈ ఒక్క విషయంలోనే కాదు సీఐ అంజూ యాదవ్ ప్రవర్తనపై గతంలోనూ అనేక విమర్శలు వచ్చాయి. సీఐ అంజు యాదవ్ తీరుకి వ్యతిరేకంగా బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులు నిరసన తెలియజేశారు. ఏమైనా ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.