ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడీగా ఉంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో విరుచు కుపడుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులపై మరోసారి ఫైర్ అయ్యారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అస్తమించిన వ్యవస్థ అని..అందులోని కొంతమంది బ్రోకర్లు విశాఖపై విషం కక్కుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కి పార్టీ అప్పగించడం కోసం జూనియర్ యన్టీఆర్ ని తిట్టిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుడివాడలోని 33వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అస్తమించిన వ్యవస్థ టీడీపీ అని… ఆ పార్టీ వారు నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పడానికి అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ యన్టీఆర్ ను తిట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు మాటల భ్రమలో పడి ఆయన సామాజికి వర్గానికి చెందిన కొందరు పిచ్చి పిచ్చి యాత్రలు చేస్తున్నారన్నారు. యన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారని నిరసన దీక్షలు చేసేవారు.. ముందుగా యన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన నుంచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబును బయటకు పంపేందుకు దీక్షలు చేయాలని నాని సూచించారు.
అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియాలాగానే విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని అన్నారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆస్తి అయినా రుషికొండలో ప్రభుత్వ ఆఫీసులు కడుతుంటే దోపిడి ఎలా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు. రూ.30 లక్షలు ఉన్న అమరావతి భూముల రేట్లు రూ.10 కోట్లకు పెరిగాయని, రాజధాని నిర్ణయం తరువాత గజాల లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇక విశాఖ పట్నంలోని దసపల్లా భూముల్లో టీడీపీ ఆఫీసు, చంద్రబాబు బ్యాచ్ కి సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.