జగనన్న విద్యాకానుకలో అందించే కిట్లను వచ్చే 2023-24 విద్యా సంవత్సరం నుంచి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. జగనన్న విద్యాకానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, షూలు, సాక్స్, బెల్టు, బ్యాగ్ తో కూడిన కిట్‌ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వస్తువులను మరింత నాణ్యమైనవి అందించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుకు పేరెంట్స్ కమిటీలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. అలా ఏటా అవసరమైన మార్పులు చేస్తూ.. విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
కొత్త మార్పులతో కిట్లలో ఇక నుంచి 3 జతల యూనిఫాంలు అందించనున్నారు. 1-5 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి మీడియం సైజు బ్యాగులు, 6-10 తరగతుల విద్యార్థులకు పెద్ద సైజు బ్యాగులు అందజేయనున్నారు. కిట్ల పంపిణీలో జాప్యం లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అందించనున్నారు. జగనన్న విద్యా కానుక పథకం అమలు కోసం రాష్ర్ట ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు. గత మూడేళ్లలో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఈ పథకం ద్వారా 47,40,421 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. అందుకు రూ.931.02 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా చేసిన మార్పులతో కిట్లు పంపిణీ చేసేందుకు రూ. 958.34 కోట్లు కావాల్సి వస్తుందని విద్యాశాఖ అంచనా వేసింది.