మధుమేహం.. ఈ దీర్ఘకాలిక వ్యాధి అంటే అందిరికీ ఎంతో భయం. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత జీవితాంతం మందులు వాడటం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి సోకుతోంది. అంతేకాకుండా షుగర్ టెస్టు అనేది ఎంతో ఖర్చుతో కూడున్న విషయం. అందుబాటులో ఉన్న పరికరాలు అన్నీ ఎంతో ఖరీదు ఉంటాయి. అయితే అలాంటి పరికరాలకు ఎంతో భిన్నంగా టైప్-2 షుగర్‌ను క్షణాల్లో గుర్తించేందుకు.. ఇప్పుడు ఆంధ్రా వర్సిటీ బృందం ఒక అద్భుతమైన పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ పరికరంతో టైప్-2 షుగర్‌ను సెకన్ల వ్యవధిలోనే, అది కూడా ఎంతో కచ్చితంగా గుర్తించవచ్చు.
ఆంధ్రా వర్సిటీలోని బయో కెమిస్ట్రీ డిపార్టుమెంట్ ఆచార్యులు డాక్టర్ పూసర్ల అపరంజి ఎంతో అత్యాధునిక పరిజ్ఞాన్ని ఉపయోగంచి ఈ బయో సెన్సార్ పరికరాన్ని తయారు చేశారు. ఇది పరిమాణంలో ఎంతో చిన్నగా ఉంటుంది. కేవలం 5 సెంటీ మీటర్ల పొడవుతో చూసేందుకు పెన్ డ్రైవ్ తరహాలో ఉంటుంది. ఈ పరికరంలో ఒక్క చుక్క రక్తం వేస్తే చాలు.. సెకను వ్యవధిలోనే ఎంతో కచ్చితత్వంతో మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. సాధారణ పరికరాల మాదిరి స్ట్రిప్ ను పదే పదే కొత్తది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రిప్ ను ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ పరికరాన్ని ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్ ట్యాప్ లకు అనుసంధానం కూడా చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేశాక టెస్టు వివరాలు అన్నీ డిస్ ప్లే అవుతాయి.
ఇక్కడితో ఆగకుండా ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏయూ టీమ్ ప్రయత్నిస్తోంది. థైరాయిడ్, క్యాన్సర్, బీపీ, కోవిడ్, కొవ్వు, గాలిలో కాలుష్యం వంటి వాటిని గుర్తించేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. క్యాన్సర్ ను గుర్తించేందుకు అనుగుణంగా స్ట్రిప్ తయారీకి ఏయూతో బార్క్ సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాకుండా కోవిడ్, ఇతర వ్యాధుల స్ట్రిప్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆంధ్రా వర్సిటీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాయి. అతి తక్కువ ధరలో ఈ పరికరాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు విశాఖకు చెందిన ఇన్నోటెక్ సంస్థ వర్సిటీతో ఎంవోయూ కూడా చేసుకుంది. ఆంధ్రా వర్సిటీ నుంచి ఒక పరిశోధన పేటెంట్ పొంది.. టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ జరిగిన మొట్టమొదటి పరికరం ఇదే కావడం విశేషం. భవిష్యత్ లో ఒక పరికరం ఒకే చిప్ అనే విధంగా తమ పరిశోధనలు సాగిస్తున్నట్లు ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ అపరంజి వెల్లడించారు. ఏయూ వర్సిటీ తయారు చేసిన ఈ బయో సెన్సార్ పరికరంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.