రైలు ప్రయాణ సమయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యాలతో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కదులుతున్న రైలును ఎక్కడం, రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు తాము దిగాల్సిన స్టేషన్ దాటిపోయే సరికి కంగారుపడి హడవుడిగా దిగి ప్రయత్నం చేస్తారు. ఇాలాంటి ఘటనలో అదుపు తప్పి రైలు కింద పడి చనిపోయినవారు ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా నిద్రపోయి.. తాను దిగాల్సిన స్టేషన్ దాటి పోవడంతో కంగారుపడి కదులుతున్న రైలు నుంచి దిగబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో రైలు బోగి, ప్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కపోయాడు. వాటి మధ్యలో ఉండిపోయి చాలాసేపు నరకం అనుభవించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన రవికుమార్ కర్ణాటక నుంచి సొంత ఊరికి వచ్చేందుకు హుబ్లీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉండటంతో రవికుమార్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో రైలు నంద్యాల దాటి వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం గిద్దలూరు స్టేషన్ కి చేరింది. రైలు కదులుతున్న సమయంలో రవికుమార్ నిద్రనుంచి మేల్కొన్నాడు. తాను దిగాల్సిన స్టేషన్ దాటిపోయిందని రవికుమార్ గ్రహించాడు. దీంతో హడావుడిలో కదులుతున్న రైలు దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కాలు జారి బోగి, ఫ్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కపోయాడు. గమనించిన గార్డు వెంటనే బ్రేక్ వేసి రైలును ఆపారు. అయితే అప్పటికే బాధితుడు ఇరుక్కుపోయి.. నొప్పితో అల్లాడినాడు.
సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు అక్కడి చేరుకుని ఫ్లాట్ ఫామ్ ను పగులగొట్టి చాకచక్యంగా బాధితుడిని బయటకి తీశారు. ఈ ప్రమాదంలో రవికుమార్ నడుముకు తీవ్రగాయాలయ్యాయి. అతడికి గిద్దలూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితుడి ఆరోగ్య సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి