ఈ ఆధునిక కాలంలో ఒకరి గురించి ఒకరు పట్టించుకునే నాథుడే ఉండడు. దీంతో మానవ సంబంధాలు కాస్తాఅడుగంటుతున్నాయి. ఈ క్రమంలో సమాజంలో మానసికంగా కుంగుబాటుకు గురైయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంట్లో మనుషులు ఉంటారు.. కానీ బయట తాళం వేసి ఉంటుంది. వారు ఎవరు చెప్పినా వినరు.. పాపం వారి మానసిక స్థితి అలాంటిది మరి. తాజాగా ఆ కుటుంబంలో చెల్లి శవంతో మూడ్రోజులుగా అక్క జాగారం చేసిన హృదయ విదారక సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌కు చెందిన చిదురాల జనార్దన్, రాజేశ్వరి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక్క కొడుకు. కూతుర్ల పేర్లు లతిత, స్వరూప, రమ, కుమారుడి పేరు ప్రసాద్. వీరందరికీ మొదటి నుంచి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. జనార్దన్ భార్య రాజేశ్వరి, కుమారుడు ప్రసాద్ ఇరవై ఏళ్ల కిందట మృతి చెందారు. పిల్లలకు మానసిక స్థితి సరిగా ఉండకపోవడంతో తండ్రి వారికి వివాహం చేయలేదు.
హనుమకొండ-సిద్దిపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంటిలో అందరూ ఉండేవారు. జనార్దన్ కూతుర్లను కనీసం బంధువుల ఇంటికి కూడా పంపేవాడు కాదు. పనుల కోసం బయటకు వెళ్తే ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే చిన్న కుమార్తె రమ్య అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల కిందట మృతి చెందింది. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఐదురోజులు శవంతోనే వాళ్లంతా ఇంట్లోనే ఉన్నారు. చివరికి విషయం తెలుసుకున్న కుల పెద్దలు అంత్యక్రియలు నిర్వహించారు.
జనార్దన్‌కి ఆరోగ్యం బాగుండక ఆరేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి లలిత, స్వరూపను బంధువులు మానసిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, కొన్నాళ్లు అక్కడ ఉన్న వాళ్లిద్దరూ పారిపోయి ఇంటికి వచ్చేశారు. లలిత తనకు వచ్చే పింఛన్‌తో పాటు బిక్షాటన చేస్తూ తిండికి సంపాదించేది.
ఈ క్రమంలో స్వరూప (50) అనారోగ్యంతో మూడు రోజుల కిందట మరణించింది. అయితే, లలిత ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా చీకటి గదిలోనే చెల్లెలు మృతదేహాన్ని ఉంచుకుని జాగారం చేసింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎముకుల గూడుగా ఉన్న స్వరూప మృతదేహాన్ని గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. హృదయ విదారకమైన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.