చివరి వరకు ఉత్కంఠ, రాజస్ఠాన్ రాయల్స్ వండర్ గేమ్

స్పోర్ట్స్ డెస్క్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ చివరి నిమిషంలో ఓటమిపాలైంది. పంజాబ్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. రెండు మంచి షాట్‌లు చాలు.. కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దానిని పునరావృతం చేసింది. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్‌ జట్టు, కార్తీక్‌ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్‌ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది.

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైశ్వాల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), లూయిస్‌ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, మధ్య ఓవర్లలో మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) చలరేగిపోయాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు 5, షమికి 3 వికెట్లు దక్కాయి. ఈ క్రమంలో పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 రన్స్‌ చేసి ఓడింది. మయాంక్‌ అగర్వాల్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కార్తీక్‌ త్యాగికి 2 వికెట్లు పడ్డాయి.

rajasthan royals vs punjab

రాజస్తాన్‌కు లభించిన ఆరంభం, ఇన్నింగ్స్‌ మధ్యలో లోమ్రోర్‌ మెరుపులు చూస్తే స్కోరు కనీసం 210–220 వరకు చేరుతుందని అనిపించింది. కానీ పంజాబ్‌ బౌలర్లు ప్రత్యర్థిని అంతకంటే చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. ఓపెనర్లు యశస్వి, లూయిస్‌ దూకుడుతో రాజస్థాన్ రాయల్స్‌ స్కోరు 5 ఓవర్లలోనే 50 పరుగులకు చేరింది. అయితే అర్ష్‌దీప్‌ తన తొలి ఓవర్లోనే లూయిస్‌ను అవుట్‌ చేసి జోడీని బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో యశస్వి 2 సిక్సర్లు, ఫోర్‌తో ధాటిని ప్రదర్శించగా, అర్ష్‌దీప్‌ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు రాబట్టిన లివింగ్‌ స్టోన్‌ (17 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్‌) తర్వాతి బంతికి వెనుదిరిగాడు.

యశస్వి అవుటైనా మరో ఎండ్‌లో లోమ్రోర్‌ చెలరేగిపోయాడు. రషీద్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, హుడా ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. మరో ఫోర్‌ సహా ఈ ఓవర్లో హుడా మొత్తం 24 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఈ ఓవర్‌ తర్వాత రాజస్తాన్‌ వేగంగా పతనమైంది. ఆఖరి 4 ఓవర్లలో 21 పరుగులు చేసిన ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పంజాబ్‌కు 42 బంతుల్లో 60 రన్స్‌ కావాల్సి ఉండగా పూరన్‌ (32), మార్‌క్రమ్‌ (26 నాటౌట్‌) మూడో వికెట్‌కు 57 రన్స్‌ జోడించడంతో గెలుపు లాంఛనంగానే కనిపించింది.

కానీ చివరి ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి వండర్‌ చేశాడని చెప్పవచ్చు. విజయానికి 4 రన్స్‌ అవసరం కాగా, ఒకే పరుగిచ్చి పూరన్‌, హూడా (0)లను అవుట్‌ చేశాడు. దీంతో ఆఖరి బంతికి 3 రన్స్‌ కావాల్సి ఉండగా సింగిల్‌ కూడా రాకపోవడంతో రాజస్థాన్‌ గట్టెక్కింది.