విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. డిప్రెస్డ్ పర్సన్, పాగల్ సేన్ అంటారంటా? అని దేవి వ్యాఖలు చేయడం, వాటిపై స్టూడియోకి వెళ్లి విశ్వక్ సేన్ రియాక్ట్ అవ్వడం, ఆ సమయంలో అభ్యంతరకర పదం వాడటం, ఆ తర్వాత విశ్వక్ మీడియా ముఖంగా సారీ చెప్పడం చూశాం. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిదంటూ విశ్వక్ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు యాంకర్ దేవీ నాగవల్లి విశ్వక్ పై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ప్రాంక్ వీడియో వెనకున్న అసలు విషయాలు బయటపెట్టిన రివ్యూ లక్ష్మణ్!
ఒక మహిళా యాంకర్ పై పరుష పదాలు, అభ్యంతరకర పదాలు ఉపయోగించడాన్ని జర్నలిస్ట్ సంఘాలు, మహిళా సంఘాలు తప్పుబట్టాయి. యాంకర్ దేవీ నాగవల్లితో పాటు జర్నలిస్ట్ సంఘాలు విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దేవీ నాగవల్లి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విశ్వక్ సేన్ ప్రవర్తనను తప్పబట్టారు. ఒక మహిళపై అలాంటి పదాలు వాడటం ఆమోదయోగ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.
తలసాని మాట్లాడుతూ.. ‘సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు సర్టెన్ పర్మిషన్స్ ఉంటాయి. రోడ్డుపై ఎవరిని పడితే వాళ్లని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. నేను పోలీసులతో కూడా మాట్లాడతాను. డిబేట్ లో కూడా దేవీ నాగవల్లితో మాట్లాడిన తీరు ప్రాపర్ గా లేదు. తప్పకుండా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. అన్నీ తమకే అనుకూలంగా ఉడాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. డిబేట్ లో అన్ని అంశాలు ఉంటాయి. ఒక ఆడ కూతురిని ఈ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు. మన కుటుంబంలో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఈ విధమైన యాటిట్యూడ్ సరిగ్గా లేదు. తప్పకుండా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోవాల్సిన చర్యలు, పోలీసుల వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడతాను. ఒక ఘటన జరిగిన తర్వాత క్షమాపణ చెప్పే తీరు కూడా వేరుంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లైట్ గా తీసుకునే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.