Viral Video: ఓ సెక్యూరిటీ గార్డు ఎంతో ధైర్య సాహాసాలు చూపించాడు. దొంగతనానికి వచ్చిన దొంగలతో వీరోచితంగా పోరాడాడు. కత్తితో నరికినా వెనక్కు తగ్గలేదు. ధైర్యంగా ఎదుర్కొని వారిని తరిమేశాడు. ఈ సంఘటన పంజాబ్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మోగా జిల్లా, ధరాపూర్ గ్రామంలోని ఓ ఆఫీస్‌లో మందర్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
బుధవారం ముగ్గురు దుండగులు మాస్కులతో ఆఫీసు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇది గమనించిన మందర్ వారిని అడ్డుకున్నాడు. వారిపై అనుమానం వచ్చి మాస్కులు తీయాలని కోరాడు. ఇందుకు ఆ దుండగులు ఒప్పుకోకపోవటంతో అక్కడినుంచి వెళ్లిపోవాలని మందర్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు దొంగలు మందర్‌పై దాడికి దిగారు. మందర్ ఏ మాత్రం భయపడకుండా వారిపై తిరగబడ్డాడు. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డగించాడు. తన చేతిలో ఉన్న తుపాకితో గాల్లోకి ఓ సారి కాల్చాడు.
ఇద్దరు దుండగులు అతడి తుపాకిని లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ గొడవ సందర్భంగా ఓ దుండగుడు మందర్‌ను పలుసార్లు కత్తితో నరికాడు. అయినా మందర్ పట్టు వీడలేదు. తుపాకిని విడిచిపెట్టలేదు. ఆ దుండగులు సెక్యూరిటీ గార్డు వీరోచిత పోరాటానికి భయపడిపోయారు. వెంటనే అక్కడినుంచి పారిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెక్యూరిటీ గార్డు ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Viral Video: గంగానదిలో 3 కి.మీ.లు ఈదిన ఏనుగు!