కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లను గమనిస్తే తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) వివిధ రంగుల్లో నంబర్ ప్లేట్లను జారీ చేస్తుంటుంది. అయితే ఇలా వివిధ రంగుల్లో జారీ చేయడానికి కారణం ఉంది. నంబర్ ప్లేట్ లో నంబర్ కి ముందు IND అని రాసి ఉంటుంది. ప్రతీ దేశానికి ఒక కోడ్ ఉంటుంది. మన దేశానికి వచ్చేసరికి అంతర్జాతీయ కోడ్ ఇంగ్లీష్ అక్షరాల్లోని మొదటి 3 అక్షరాలైన IND అయ్యింది. మీరు వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్తే.. వాహనాన్ని బట్టి తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు కలిగిన నంబర్ ప్లేట్లను ఇస్తారు. ఇవి ఎందుకు ఇస్తారో తెలుసుకునే ముందు అసలు ఎన్ని రంగుల నంబర్ ప్లేట్లు ఉన్నాయో తెలుసుకోవాలి. మొత్తం మన దేశంలో 8 రకాల నంబర్ ప్లేట్లు ఉన్నాయి. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం, నలుపు, బాణం గుర్తు పైకి ఉన్న నంబర్ ప్లేట్, జాతీయ చిహ్నం కలిగిన ఎరుపు రంగు నంబర్ ప్లేట్ మొత్తం 8 నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
నంబర్ ప్లేటు తెలుపు రంగులో ఉండి.. దాని మీద అక్షరాలు నలుపు రంగులో ఉంటాయి. ఇలా ఉంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వాహనం అని అర్థం. బైకులు, కార్లు, జీపులు ఏ వాహనం అయినా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకునేట్టు అయితే ఈ తెలుపు రంగు ప్లేట్ తగిలిస్తారు. అలా కాకుండా రెగ్యులర్ వాడకం పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి.. కమర్షియల్ గా అంటే గూడ్స్ రవాణాకి, ప్రయాణికులను ఎక్కించుకుని తిప్పడానికి వాడితే నాలుగు తగిలిస్తారు. తెలుపు రంగు నంబర్ ప్లేట్ అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వాడాలి.
దీని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఎక్కువగా ఈ రంగు నంబర్ ప్లేట్లు కలిగిన కార్లు చూస్తుంటారు. క్యాబ్ లు, బైకులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా పసుపు రంగు నంబర్ ప్లేటుని కలిగి ఉంటాయి. పసుపు రంగు ప్లేట్ మీద.. నల్లని అక్షరాలు కలిగి ఉంటాయి. కమర్షియల్ పర్పస్ వాడే వాహనాలకి ఈ రంగు నంబర్ ప్లేట్ ని తగిలిస్తారు. ప్రయాణికులను ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకెళ్లే వాహనాలకు ఈ రంగు ప్లేట్ పెడతారు.
ఈ మధ్య కాలంలో ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనర్థం అవి ఎలక్ట్రిక్ వాహనాలు అని. ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆకుపచ్చ రంగు కలిగిన నంబర్ ప్లేట్లు ఉండి.. వాటి మీద తెల్లని రంగులో అక్షరాలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాలకు ఇదే రంగు నంబర్ ప్లేట్ ని ఇస్తారు. అక్షరాలు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం ఆకుపచ్చ నంబర్ ప్లేట్.. దాని మీద పసుపు రంగు అక్షరాలు ఉంటాయి.
సొంతంగా నడుపుకునే కార్లకు లేదా అద్దెకి ఇచ్చే కార్లకు నలుపు రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. వీటి మీద పసుపు రంగు అక్షరాలు ఉంటాయి. ఇలా ఉంటే ఆ వాహనాలు కమర్షియల్ వాహనాలుగా రిజిస్టర్ చేయబడ్డాయని అర్థం. ఈ రంగు నంబర్ ప్లేట్ కలిగిన కారుని నడిపేందుకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ రంగు నంబర్ ప్లేట్లు ఎక్కువగా రెంటల్ వాహనాలు, లగ్జరీ హోటల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల మీద చూడవచ్చు.
ఎరుపు రంగు నంబర్ ప్లేట్ ఉండి.. దాని మీద తెలుపు రంగు అక్షరాలు ఉంటాయి. కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇస్తారు. తెలుపు అక్షరాలతో ఎరుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ఆ వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ కలిగి ఉందని అర్థం. ఆర్టీఓ ఆఫీస్ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ వచ్చే వరకూ ఈ నంబర్ ప్లేట్ ని వాడుకోవచ్చు. అయితే ఈ తాత్కాలిక నంబర్ ప్లేట్ ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఎరుపు రంగు నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలను రోడ్ల మీద తిరిగేందుకు అనుమతించరు.
తెలుపు రంగు అక్షరాలతో నీలం రంగు నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలను విదేశీ దౌత్యవేత్తల కోసం వినియోగిస్తారు. మన దేశానికి విదేశాల నుంచి ప్రముఖ వ్యక్తులు వస్తుంటారు. వారి కోసం ఈ కార్లను ఉపయోగిస్తారు. CC (కాన్సులర్ కార్ప్స్), UN (యునైటెడ్ నేషన్స్), DC (డిప్లొమాటిక్ కార్ప్స్) వంటి వారికి ఈ కార్లను ఉపయోగిస్తారు. ఈ నంబర్ ప్లేట్ మీద రాష్ట్ర కోడ్ బదులు వాళ్ళ దేశానికి సంబంధించిన కోడ్ ఉంటుంది కాబట్టి.
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిలిటరీ వాహనాలకు ఈ నలుపు రంగు నంబర్ ప్లేట్లు ఉపయోగిస్తారు. తెల్లని అక్షరాలకు ముందు ఒక బాణం గుర్తు పైకి ఉంటుంది. దీన్ని బ్రాడ్ ఏరో అంటారు. బాణం గుర్తు తర్వాత ఉన్న రెండు అంకెలు.. ఆ వాహనం ఏ ఏడాదిలో తయారు చేయబడిందో సూచిస్తాయి. పైకి ఉండే బాణం గుర్తు, రెండు అంకెలు తర్వాత ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. ఇది వాహనం యొక్క క్లాస్ ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బాణం గుర్తు పైకి ఉండి.. 22D 153874w ఉంటే కనుక.. 22 అనేది వాహనం తయారైన సంవత్సరం 2022. ఇక D అంటే వాహనం యొక్క క్లాస్.
టూవీలర్ కి A క్లాస్, కార్లు, జీపులకి B క్లాస్, లైట్ మోటార్ వాహనాలకు C, హెవీ మోటార్ వాహనాలకు D, ఇండియన్ ఆర్మీ స్పెషల్ వాహనాలకు E, స్పెషల్ క్రేన్ లకు F, ఆర్మీ బుల్ డోజర్ కు G, పోర్టబుల్ జనరేటర్ వాహనాలకు NB, ఆర్మీ అంబులెన్స్ కి K, ఇండియన్ ఆర్మీ బస్ కి P అక్షరాలను ఉపయోగిస్తారు. దీని తర్వాత వచ్చే ఆరు అంకెలు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ని సూచిస్తాయి. ఆఖరున ఒక ఇంగ్లీష్ అక్షరం వస్తుంది. ఇది ఆ వాహనం ఎక్కడికు వెళ్తుందో అనే చెక్ కోడ్ ని సూచిస్తుంది. ఎరుపు రంగు నంబర్ ప్లేట్ మీద 4 గోల్డెన్ స్టార్లు కలిగి ఉంటే ఆ ఆర్మీ చీఫ్ కి చెందినదని అర్థం.
రాష్ట్ర గవర్నర్ లు వాడే కార్లకు ఎరుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉంటాయి. ఇదే నంబర్ ప్లేట్ మీద బంగారు జాతీయ చిహ్నం ఉంటే గనుక అది రాష్ట్రపతికి చెందిన వాహనం అని అర్థం.
సాధారణంగా నంబర్ ప్లేట్ నంబర్ ప్లేట్ మీద ఉండే మొదట 3 అక్షరాలు దేశం యొక్క కోడ్ అయితే.. తర్వాత వచ్చే రెండు అక్షరాలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన కోడ్. ఆ తర్వాత వచ్చే 2 అంకెలు ఆర్టీఓ కోడ్. ఆ తర్వాత వచ్చే 2 ఇంగ్లీష్ అక్షరాలు, 4 అంకెలు బండి యొక్క యూనిక్ కోడ్. ఉదాహరణకు ‘IND AP 01 AB 1234’ నంబర్ ప్లేట్ తీసుకుంటే.. IND అంటే దేశం యొక్క కోడ్. AP అంటే ఆంధ్రప్రదేశ్ కోడ్. 01 అంటే వాహనం ఎక్కడ రిజిస్టర్ అయ్యిందో తెలిపే ఆర్టీఓ కోడ్. ఆ తర్వాత వచ్చే కోడ్ వాహనం యొక్క కోడ్. ఇది 2 ఇంగ్లీష్ అక్షరాలు, 4 అంకెలు కలిగిన కోడ్. తెలంగాణకు TS అని, ఢిల్లీకి DL, తమిళనాడుకి TN అని, కేరళకు KL అని ఇలా ఉంటాయి.