ఎండలో ఏ వస్తువు పెట్టినా వెంటనే వేడెక్కిపోతుంది. కానీ చెట్ల ఆకులు మాత్రం వేడెక్కవు. ఎందుకో తెలుసా?
బయట ఎండ ఏ రేంజ్ లో ఉందో తెలుసు కదా. పెనం పెట్టి దాని మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోయే పరిస్థితి. రైస్ పెడితే ఉడికిపోయే పరిస్థితి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. అసలు కాసేపు ఎండలో నిలబడితే ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఏ వస్తువైనా గానీ ఎండలో ఉంటే వేడెక్కిపోతుంది. వాహనం కాసేపు ఎండలో పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి సీట్ కాలిపోతుంది. కానీ ఎంత ఎండలో అయినా చెట్ల ఆకులు వేడెక్కవు. వేడెక్కకపోగా చల్లగా ఉంటాయి. మీరెప్పుడైనా ఆలోచించారా? చెట్టు కింద నిలబడితే వేడి అనేది ఉండదు. పైగా చల్లగా ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుందో తెలుసా?
చెట్ల ఆకులు వేడెక్కకపోవడానికి శాస్త్రీయ కారణం ఉంది. చెట్ల ఆకుల్లో బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వల్ల ఆకులు వేడెక్కకుండా చల్లగా ఉంటాయి. కణాల యొక్క అనేక పొరలతో చెట్ల ఆకులు ఏర్పడి ఉంటాయి. ఆకుల పై భాగాన్ని ఎగువ బాహ్యచర్మం (అప్పర్ ఎపిడెర్మిస్), కింది భాగాన్ని దిగువ బాహ్యచర్మం (లోయర్ ఎపిడెర్మిస్) అనే పొరలు కప్పి ఉంచుతాయి. లోయర్ ఎపిడెర్మిస్ పొరలో స్టోమేట్ అనబడే అనేక రంధ్రాలు ఉంటాయి. ఇవి కవాటాల్లా పని చేస్తాయి. ఈ కవాటాలు తెరిచి ఉన్నప్పుడు కార్బన్ డయాక్సయిడ్ ను ఆకు లోపలకు వెళ్లేలా చేస్తాయి. ఆ సమయంలో ఆక్సిజన్ ను, నీటి కణాలను బయటకు వదులుతాయి.
రంధ్రాలు మూసుకుని ఉన్న సమయంలో ఆకుల్లో ఉన్న గాలి బయటకు వెళ్లడం గానీ, బయట ఉన్న గాలి ఆకులోకి వెళ్లడం గానీ జరగదు. ఈ రంధ్రాల ద్వారా బయటకు పోయిన నీటిని వేళ్ళ ద్వారా మళ్ళీ పీల్చుకుంటాయి. ఈ ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. సాధారణంగా ఈ రంధ్రాలు పగటి పూట తెరచుకుని.. రాత్రి వేళ మూసుకుని ఉంటాయి. రాత్రి ఎండ ఉండదు. పగలు ఎండ ఉన్నా రంధ్రాలు తెరుచుకుని ఉండడం వల్ల ఎండ ఉష్ణోగ్రత అనేది నిలబడదు. పైగా వేళ్ళ ద్వారా నీటిని పీల్చుకుంటాయి. అందుకే ఎండలో కూడా మొక్కల ఆకులు చల్లగా ఉండి మనకు నీడను, చల్లదనాన్ని ఇవ్వగలుగుతున్నాయి.