ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్లు, బ్రాడ్ కాస్ట్ టవర్లు అనేవి ఎక్కువైపోయాయి. అయితే ఈ టవర్ల మీద ఎరుపు, తెలుపు రంగులతో కూడిన లైట్లు ఉంటాయి. అవి ఎప్పుడూ బ్లింక్ అవుతా ఉంటాయి. ఇవి ఎందుకు పెట్టారు? ఎందుకు బ్లింక్ అవుతా ఉంటాయి?
మన ఉండే నివాస ప్రాంతాలకు కొద్దిగా దూరంలో సెల్ టవర్ గానీ బ్రాడ్ కాస్ట్ టవర్ గానీ ఉంటాయి. కొంతమంది ఇళ్ల పైన, అపార్టుమెంట్ల పైన కూడా ఉంటాయి. అయితే ఈ టవర్ల మీద రెడ్ లైట్లు ఉండడానికి, అవి బ్లింక్ అవుతూ ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ లైట్లు విమానం, హెలికాప్టర్ నడిపే పైలట్ల కోసం, అలానే పక్షుల కోసం ఏర్పాటు చేశారని మీకు తెలుసా? నిజానికి మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ టవర్ ని ఆవిష్కరించిన సమయంలో రెడ్ లైట్లు అనేవి లేవు. ఎటువంటి లైట్లు లేకుండా ఉండేవి. అయితే రాత్రుళ్ళు హెలికాఫ్టర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ టవర్లను గుద్దుకునేవి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా చలికాలంలో జరిగేవి. ఎక్కువగా మంచు కురవడం, పగలంతా వెలుతురు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరిగేవి.
అందుకు పరిష్కారంగా టవర్ల మీద ఎరుపు రంగు లైట్లను అమర్చారు. ఎరుపు రంగు లైట్ వెలుగుతుండడం వల్ల పైలట్ సులువుగా అక్కడ ఒక వస్తువు ఉందని అర్థం చేసుకుంటాడు. ఎరుపు రంగు మాత్రమే టవర్ల మీద పెట్టడానికి కారణం ఏంటంటే.. ఈ ఎరుపు రంగు మాత్రమే అత్యధిక తరంగ ధైర్ఘ్యం (వేవ్ లెంత్) కలిగి ఉంటుంది. ఇతర రంగులతో పోలిస్తే ఇది ఎక్కువ చుట్టుపక్కలకు వ్యాపించదు. దీని వల్ల దూరంగా ఉన్నా కూడా ఈ రంగుని గుర్తించగలుగుతారు. 45 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్లకు ఈ ఎరుపు రంగు లైట్లు ఇన్స్టాల్ చేసారంటే దాని అర్థం.. ఎయిర్ క్రాఫ్ట్ వార్నింగ్ లైట్స్ అని. ఎత్తైన నిర్మాణాలపై విమానాలను హెచ్చరించడానికి ఎరుపు, తెలుపు రంగులతో కూడిన లైట్లను అమర్చాలని విమానయాన అధికారులు పేర్కొన్నారు.
అయితే తెలుపు కంటే ఎక్కువగా ఎరుపు రంగు లైట్లను ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాల మీద కూడా ఇలానే ఎరుపు రంగుతో కూడిన లైట్లను అమరుస్తారు. దీని వల్ల భవనాలకు సమీపంలో పైలట్లు హెలికాప్టర్ ని గానీ, విమానాన్ని గానీ నడపరు. ట్రైనింగ్ విమానాలు చిన్నవి ఉంటాయి. అవి సిటీల్లో రోజంతా తిరుగుతా ఉంటాయి. ఇవి కొంచెం ఎత్తు నుంచి మాత్రమే వెళ్తాయి. ఆ సమయంలో ఈ ఎరుపు రంగు లైట్లు ప్రమాదాలు జరక్కుండా ఆపుతుంది. ఇక రెడ్ లైట్లు బ్లింక్ అవ్వడానికి మరొక కారణం ఉంది. 1976 లో మిచిగాన్ లోని గన్ లేక్ లో ఉన్న ఒక టవర్ వల్ల ఒక్క రాత్రిలో 2,300 పక్షులు చనిపోయాయి. ఈ ఒక్క టవర్ వల్ల అన్ని పక్షులు చనిపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టవర్ల వల్ల ఎన్ని పక్షులు చనిపోతాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ మరణాలను తగ్గించడం కోసం టవర్ల మీద ఎరుపు రంగు లైట్లను బ్లింక్ అయ్యేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల 70 శాతం పక్షుల మరణాలను తగ్గించగలిగారు. ఎరుపు లేదా తెలుపు రంగు లైట్ల వేవ్ లెంత్ కి గురైనప్పుడు.. నావిగేషన్ కోసం అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయని పరిశోధనలో తేలింది. రాత్రుళ్ళు పక్షులు నక్షత్రాల వెలుగులో ప్రయాణించడం కష్టమవుతాయి. అటువంటి సమయంలో ఈ టవర్ల మీద ఉన్న ఎరుపు రంగు లైట్లు వాటిని అయోమయానికి గురి చేస్తాయి. అదే బ్లింక్ అవుతున్న లైట్లు అయితే వాటిని కన్ఫ్యూజ్ చేయవు. అందుకే వీటిని రాత్రుళ్ళు బ్లింక్ అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ టవర్లను మోర్ బర్డ్ ఫ్రెండ్లీ టవర్స్ అని కూడా అంటారు.