పెద్ద వాళ్ల కంటే చెప్పుకోవడానికి నోరు ఉంటుంది. ఏదైనా నొప్పి ఉంటే బయటకు చెప్తారు. ఆకలి వేస్తే అడుగుతారు. కానీ మాటలు రాని శిశువులకు, పిల్లలకు అది నొప్పి అన్న విషయమే తెలియదు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బేబీలు ఎక్కువగా ఏడుస్తుంటారు. రాత్రి పూట అస్సలు నిద్రపోరు. చాలా మంది పిల్లలు రాత్రి సమయంలోనే పేచీ పెడతారు. ఏదో తల్లిదండ్రుల మీద పగబెట్టినట్టు.. టైం చూసి మరీ ఏడుస్తారు. రాత్రి పూటే ఏడవాలా? ఏ పగలంతా ఖాళీనే కదా. అప్పుడు ఏడవచ్చు కదా అనిపిస్తుంది. పగలు సమయంలో బోసినవ్వు ఏసుకుని నవ్వుతారు. కానీ రాత్రి మాత్రం పేచీ పెడతారు. దీనికి మన పెద్దలు చెప్పే కారణం ఏంటంటే.. అమ్మని తీసుకుపోతా అని దేవుడు అంటే పిల్లలు ఏడుస్తారంట, అదే నాన్నని తీసుకుపోతా అంటే నవ్వుతారంట. ఇది సరదాగా చెప్తారులెండి. కానీ పిల్లలు ఏడవడానికి కారణం.. రాత్రి పూట నిద్రపోకపోవడానికి కారణం వేరే ఉంది.
అసలు పిల్లలకు రాత్రి, పగలు అనే తేడా తెలియదు. కొంతమంది పిల్లలు పగలు ఎక్కువగా నిద్రపోతే.. కొంతమంది రాత్రుళ్ళు నిద్రపోతారు. రాత్రుళ్ళు నిద్రపోయిన పిల్లలు.. పగలు బాగా పేచీ పెడతారు. కానీ ఎక్కువ మంది రాత్రి పూటే నిద్రపోకుండా పేచీ పెడతారు. దీనికి కారణం ఫ్రస్ట్రేషన్, అలసట. పిల్లలకి ఫ్రస్ట్రేషన్ ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ తాత్కాలికంగా వచ్చేవే. ఆకలితో ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తారని అందరికీ తెలిసిందే. ఒకసారి పాలు ఇస్తే వారి చిన్ని బొజ్జ నిండదు. పాలు వెంటనే జీర్ణమైపోతాయి. అందుకే వాళ్ళు ఆకలితో ఏడుస్తారు. అయితే రాత్రి పూటే ఎందుకు ఏడుస్తారు అని అంటే.. ఆ సమయంలోనే వారు ఎక్కువగా ఆకలితో ఉంటారు. ఆకలి వారిని నిద్రపోనివ్వదు. పైగా పిల్లలు ఎదిగేది రాత్రి సమయంలోనే. కాబట్టి దీన్ని మార్చడానికి ప్రయత్నించవద్దని నిపుణులు అంటున్నారు.
ఆకలితో ఏడుస్తున్నారని తెలిస్తే.. పాలు ఇవ్వాలని చెబుతున్నారు. ఎన్ని సార్లు పాలు పట్టినా ఏడుస్తున్నారంటే దానికి కారణం.. జలుబు, అలర్జీ, కడుపులో గ్యాస్ సమస్య ఉండడం, మలబద్ధకం ఉండడం, దంతాల సమస్య వంటివి కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు చెప్పుకోలేరు. అసౌకర్యంగా ఉండడంతో ఏడుస్తారు. పిల్లల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి.. ఏదైనా నొప్పి ఉందేమో చెక్ చేయించి.. మందులు వేయాలి. ఒకవేళ గ్యాస్ సమస్య అని అనిపిస్తే.. మీరు మీ శిశువుకి మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం కల్పించవచ్చు. కొంతమంది పిల్లలు.. తల్లిదండ్రుల ప్రేమ కోరుకుంటారు. రాత్రుళ్ళు వాళ్ళు సమయం వృధా చేయాలనుకోరు. తల్లితోనో, తండ్రితోనో గడపాలని అనుకుంటారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు. అంతేకాదు.. మీతో ఆడుకోవాలని అనుకుంటారు. అర్థరాత్రి అయినా సరే ఆడుకోవడం వారికి సరదా. మీరు సహకరించకపోతే పేచీ పెడతారు. లైట్లు ఆపేస్తే వెంటనే ఏడవడం మొదలుపెడతారు.
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. పిల్లలు స్టిమ్యులేషన్ కి గురైతే అస్సలు నిద్రపోరు. బేబీ స్టిమ్యులేషన్ అంటే బేబీ యొక్క దృష్టి, శబ్దం, స్పర్శ, రుచి, వాసన వంటివి ఓవర్ గా రియాక్ట్ అవ్వడం. ఇది శిశువు యొక్క శ్రద్ధ, జ్ఞాపకశక్తి, కుతూహలం, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తల్లి నుంచి వస్తుంది. తల్లి చాక్లెట్లు అధికంగా తినడం వల్ల.. ఆ చాక్లెట్లలో ఉన్న పదార్థాలు తల్లి పాల ద్వారా పిల్లల కడుపులోకి వెళ్తుంది. దీని వల్ల వాళ్ళు రాత్రుళ్ళు పడుకోకుండా ఆటలు ఆడతారు. అయితే రాత్రి పూట పిల్లలు పడుకోవడం లేదంటే దానర్థం.. పాలిచ్చే తల్లులు తినే ఆహారం శిశువు యొక్క కడుపుతో ఏకీభవించడం లేదని. కొత్తగా పుట్టిన శిశువులు 24 గంటల వ్యవధిలో 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతుంది. కొంతమంది శిశువులు 18 నుంచి 19 గంటలు నిద్రపోతారు.
అయితే కొత్తగా పుట్టిన శిశువులు.. ప్రతీ కొన్ని గంటలకొకసారి ఆకలితో నిద్రలేస్తారు. తల్లి పాలు తాగే పిల్లలకు ప్రతీ 2, 3 గంటలకొకసారి పాలు ఇవ్వాలి. డబ్బా పాలు పట్టించే వాళ్ళు ప్రతీ 3, 4 గంటలకొకసారి తరచుగా పడుతుంటారు. పిల్లలు ఆరోగ్యకరమైన బరువుతో ఎదగాలంటే.. 3, 4 గంటలకొకసారి పాలు ఇస్తుండాలి. ఇలా చేస్తే మొదటి వారాంతంలోనే ఫలితం కనబడుతుంది. బిడ్డ పుట్టిన మొదటి నెలలో తల్లిదండ్రులకు బాగా ఇబ్బంది ఉంటుంది. రాత్రుళ్ళు ఎక్కువగా నిద్ర లేస్తారు. ప్రతీ బిడ్డకు భిన్నమైన స్లీప్ పాటర్న్ ఉంటుంది. 2 నుంచి 3 నెలలు ఉన్న శిశువులు.. రాత్రంతా అంటే 5 నుంచి 6 గంటలు నిద్రపోతారని స్టడీస్ చెబుతున్నారు. కానీ కొంతమంది నిద్రపోరు. దీనికి కారణం పైన చెప్పిన సమస్యలు కావచ్చు. మరి చంటి పిల్లలు రాత్రుళ్ళు నిద్రపోకపోవడానికి, అలానే పేచీ పెట్టడానికి గల కారణాలు తెలిస్తే కామెంట్ చేయండి.