గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడికి కొబ్బరికాయలు, అరటి పండ్లు మాత్రమే ఎందుకు సమ్పరిస్తారు? మీరెప్పుడైనా ఆలోచించారా ఇలా ఎందుకు చేస్తారో అని? భగవంతుడికి అరటిపండ్లు, కొబ్బరికాయలు సమర్పించడం వెనుక ఉన్న కారణం ఏంటి?
దేవాలయాలకు వెళ్ళేటప్పుడు భక్తులు కొబ్బరికాయలు, అరటి పళ్ళు కొనుక్కుని పట్టుకెళ్తుంటారు. గుడికి వెళ్ళినప్పుడే కాదు, పండగల్లో, పూజల్లో దేవుడికి సమర్పించడానికి కొబ్బరికాయలు, అరటి పళ్లే ఎక్కువగా పెడుతుంటారు. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మిగతా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పెడుతుంటారు. అయితే అరటి పండ్లు, కొబ్బరికాయలు మాత్రమే ఎక్కువగా దేవుడికి సమర్పిస్తుంటారు.దీని వెనుక కారణం ఏదైనా ఉందా? లేక ఏదో యాదృచ్చికంగా సమర్పిస్తున్నారా? అంటే కారణం ఉంది. ఒక వ్యాలిడ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. భగవంతుడికి అర్పించే కొబ్బరికాయలు, అరటి పండ్లు పవిత్రతకు మారుపేరుగా పిలుస్తారు. అలా అని ఇతర పండ్లు అపవిత్రం అని కాదు. అవి ఎంగిలి పండ్లు అని అర్థం.
మనం యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, సపోటా ఇలా ఏ పండు తిన్నా వాటిలో విత్తనాలు బయటకు వదిలేస్తాం. ఆ విత్తనాలు మొక్కలయ్యి పండ్లు అయ్యే అవకాశం ఉంది. అందుకే అవి ఎంగిలి పండ్లతో సమానం. కానీ కొబ్బరికాయ, అరటిపండ్లు అలా కాదు. కొబ్బరికాయ తినేసి పైన డొప్ప పడేస్తే దాన్నుంచి కొబ్బరికాయలు అనేవి పుట్టవు. కొబ్బరి నాటితే కొబ్బరి చెట్టు పుట్టదు. మనం తిని పడేసిన కొబ్బరి పెంకు నుంచి గానీ, ముందే తీసేసిన పీచు నుంచి గానీ కొబ్బరి మొక్క మొలిచే అవకాశం లేదు. అందుకే కొబ్బరి కాయను కూడా ఎంగిలి పండు కాదని మన పూర్వీకులు నిర్ధారించి భగవంతునికి సమర్పించాలని సూచించారు.
అరటి పండు కూడా అంతే. అరటిపండుకు బీజం ఉండదు. ఒక అరటిచెట్టు నాటితే వందల పిలకలు వస్తాయి కానీ అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే అరటి పండును ఎంగిలి కాని పండుగా భావిస్తారు. అలానే పూర్ణఫలం అని కూడా అంటారు. ఇక కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచు అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకు, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా చెబుతారు. అహంకారమనే పీచుని తొలగించి.. తెల్లని కొబ్బరి లాంటి మనసును ప్రదర్శిస్తూ.. నీటి వలే నిర్మలంగా ఉండాలని చెబుతారు. భగవంతుడా.. నేను నా అహంకారాన్ని విడిచి పెట్టి నిర్మలమైన మనసుతో నన్ను నీకు అర్పించుకుంటున్నా అని చెప్పే ఉద్దేశంతో ఇలా కొబ్బరికాయను మనిషి శరీరంతో పోల్చారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.