Kushaiguda Police Station: ఈ దేశంలో రాత్రైతే అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం పోలీసులు. పోలీస్ లేకపోతే రోజు ప్రశాంతంగా గడవదు. అందుకే పోలీసులంటే ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. కానీ కొందరు పోలీసులు మాత్రం పోలీసులపై ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోయేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. కేసుని విచారించమని కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జనవరి నెలలో కేసు పెడితే 7 నెలలు అవుతున్నా కూడా పట్టించుకోకపోవడంతో.. ఇక విసిగిపోయిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ ముందే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. తనను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని, వ్యక్తిగత దూషణలు చేస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 17న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేశారు. అయితే ఆ వ్యక్తిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రెండు రోజుల తర్వాత రాచకొండ కమిషనరేట్ నేరేడ్‌మేట్ డీసీపీ ఆఫీసులో ఇదే విషయంపై రిపోర్ట్ చేశానని ఆమె అన్నారు. దీంతో కోర్టు కూడా ఈ కేసుపై విచారణ చేపట్టాలని ఆదేశించిందని అన్నారు. అయితే కోర్టు ఆదేశించినప్పటికీ ఎస్సై పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదారు సార్లు ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదని ఆమె వాపోయారు. అందుకే ఈ వీడియో చేస్తున్నానని, ఈ వీడీయోను ప్రతీ ఒక్కరూ షేర్ చేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె రిక్వస్ట్ చేశారు. తన పోరాటానికి అందరూ మద్ధతు తెలపాలని ఆమె కోరారు. ప్రస్తుతం మహిళకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులంటే పబ్లిక్ సర్వెంట్స్.. కానీ పబ్లిక్‌నే సర్వెంట్స్‌లా చూస్తున్న ఈ పోలీసులపై సదరు మహిళ చేస్తున్న పోరాటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.