డాక్టర్ కావాల్సిన బిడ్డ.. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలో నరకం అనుభవించి కన్ను మూసింది. ఇక బిడ్డ అంత్యక్రియల వేళ.. కుమార్తెను చూసుకుని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు ఉబికి వస్తోంది. ప్రీతి స్వగ్రామంలో దృశ్యాలు ఇవి.
పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రవేశించి.. డాక్టర్ కోర్సు పూర్తి చేసి.. సమాజానికి సేవ చేయలనుకుంది ప్రీతి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది ఆమె కోరిక. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. మెడిసిన్ సీటు తెచ్చుకుని.. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం పీజీ చేస్తోంది. చదువుతూనే మరో వైపు ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. మరో రెండేళ్లల్లో పీజీ పూర్తవుతుంది. ఆమె కల సాకారం అవుతుంది. ఇక జీవితాశయం దిశగా అడుగులు వేయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ప్రీతిని బతికించడం కోసం వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవన్ని వృథా అయ్యాయి. ఆదివారం రాత్రి ఆమె మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ కారణంగా ప్రీతి మృతి చెందినట్లు వెల్లడించారు వైద్యులు.
ఇక తీవ్ర ఉద్రిక్తతల నడుము ప్రీతి మృతదేహాన్ని ఆమె గ్రామానికి తరలించారు. డాక్టర్ అయ్యి వస్తుందనుకున్న బిడ్డ.. పాడె ఎక్కడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండాలో పుట్టిన బిడ్డ.. జీవితంలో ఇంత గొప్ప స్థాయికి ఎదిగిందని గర్వ పడ్డ తండా వాసులు.. జీవం లేని ప్రీతిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు ఆదర్శంగా నిలిచిన సోదరి ఇక లేదని తోబుట్టువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ప్రీతి స్వగ్రామం గిర్ని తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు ప్రీతి కడసారి చూపు కోసం తరలి వచ్చారు. ఇక ఉద్రిక్తల నేపథ్యంలో.. భారీ బందోబస్తు మధ్య ప్రీతి అంత్య క్రియలు నిర్వహించారు తల్లిదండ్రులు. అశ్రునయనాల మధ్య బిడ్డతో పాటు ఆమె కలలన్ని.. వారి ఆశలను.. సంతోషాన్ని కప్పేశారు. బిడ్డను మర్చిపోయి.. ఆ దుఖం నుంచి బయటపడ్డానికి ఆ తల్లిదండ్రులకు ఈ జీవితం సరిపోదు అంటున్నారు బంధువులు.