పచ్చగా సాగిపోతున్న ఆ కుటుంబంలో షేర్ల మార్కెట్ లో పెట్టుబడులు, బెట్టింగులు చిచ్చుపెట్టాయి. షేర్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టాలు రావడంతో ఆ దంపతులు మధ్య గొడవలకు ప్రారంభమయ్యాయి. చివరకు బెట్టింగ్ పెట్టిన చిచ్చు ఆ కుటుంబంలో ముగ్గురి బలి తీసుకుంది.
ప్రతి ఒక్కరికి డబ్బులు బాగా సంపాదించాలనే కోరిక ఉంటుంది. దాని కోసం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే కొందరు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, బెట్టింగ్స్ పెడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు అనే అభిప్రాయంలో ఉంటారు. కొందరికి షేర్ మార్కెట్ల ద్వారా మంచి లాభాలే వచ్చిన.. మరికొందరికి మాత్రం తీవ్ర నష్టాలను కలిగిస్తుంది. షేర్ మార్కెట్ , బెట్టింగ్స్ నష్టపోయి వారిలో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఈ రెండిటి కారణంగా ఓ పచ్చని సంసారం నిట్ట నిలువునా ఆరిపోయింది. బెట్టింగ్ ఆ ఇంట్లో ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోరం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన అడపా కృష్ణారావు కుమార్తె మృదుల(38)ను సత్తుపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాటి బండ్ల ప్రశాంత్ కు ఇచ్చి 2009లో వివాహం చేశారు. అమెరికా వెళ్లిన ప్రశాంత్ .. మూడేళ్ల పాటు ఉద్యోగం చేస్తూ భార్యతో నివాసం ఉన్నారు. ఈ దంపతులకు అక్కడ ఉండగానే పెద్ద కుమారుకడు ప్రజ్ఞాన్(7) జన్మించాడు. అయిదేళ్ల క్రితం తిరిగి హైదరాబాద్ వచ్చి.. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారికి మహాన్(5) అనే బాబు జన్మించాడు.
ప్రస్తుతం పెద్ద వాడు రెండో తరగతి, చిన్న వాడు యూకేజి చదువుతున్నారు. ప్రశాంత్ కి షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం, బెట్టింగ్ లు పెట్టే అలవాటు ఉండేది. వీటి కారణంగా ప్రశాంత్ కి అప్పులు బాగా పెరిగాయి. దీంతో కొండాపూర్ లో ఉన్న ప్లాట్ ను రూ.65 లక్షలకు అమ్మేసి అప్పులు తీర్చారు. అయితే ఈ బెట్టింగ్ ల వ్యవహారం ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. భార్యకు కట్నంగా ఇచ్చిన రూ.2 కోట్ల విలువ చేసే 7.5 ఎకరాల పొలం అమ్మాలని ఏడాది నుంచి మృదులతో గొడవ పడుతుండేవాడు. మృదుల తల్లిదండ్రులు నచ్చ చెప్పిన ప్రశాంత్ లో మార్పులు రాలేదు.
ఈక్రమంలో జీడిమామిడి తోటను అమ్మేందుకు వారం క్రితమే హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి ప్రశాంత్ కుటుంబం వచ్చింది. సోమవారం రాత్రి సత్తుపల్లిలోని అయ్యగారిపేట శివారలోని దామెర చెరువుకు చేరుకున్నారు. బ్యాగు, ఫోన్ ను చెరువు ఒడ్డున పెట్టారు. చిన్న కుమారుడి కాలికి చున్నీతో కట్టి పెద్ద వాడిని ఎత్తుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నానని మృదుల తెలిపారు.
మంగళవారం తెల్లవారు జామున వారి ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనుకుని.. వారితో కలిసి మృదుల ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీవితంలో ఎదురయ్యే సమస్యకు చావే పరిష్కారంగా భావించి.. కొందరు ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.