సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతాయి. వారి చిన్ననాటి, దశాబ్దాల నాటి ఫోటోలు చూస్తే.. గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎక్కువగా సినీ సెలబ్రిటీల ఫోటోలు వైరలవుతాయి. కానీ నేడు కేసీఆర్ పాత ఫోటో ఒకటి వైరలవుతోంది. దాని ప్రత్యేకత ఏంటంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 15 బుధవారం నాడు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. కొండగట్టు ఆలయాన్ని కూడా యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో నేడు కొండగట్టులో పర్యటించిన కేసీఆర్.. ఆంజనేయ స్వామి ఆలయం, పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆలయ అభివృద్ధి గురించి అధికారులతో చర్చించారు. ఇక కేసీఆర్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
కేసీఆర్ గతంలో కొండగట్టుకు వచ్చిన సందర్భంగా తీసిన ఫోటో ఇది. దీనిలో చిన్ననాటి కేటీఆర్, కవితలు ఉన్నారు. గతంలో కేసీఆర్ టీడీపీ నేతగా కొనసాగుతున్న కాలంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చాడు. అక్కడ కొండపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. ఆ సమయంలో చిన్నారి కేటీఆర్, కవితలను తన భుజాల మీద ఎక్కించుకుని.. వారితో ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు.
పాతికేళ్ల తర్వాత మళ్లీ నేడు కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. ఉద్యమ సమయంలో ఆయన చాలా ఆలయాలు దర్శించుకున్నారు.. ప్రత్యేక రాష్ట్రం కావాలని మొక్కుకున్నారు.. సీఎం అయ్యాక మొక్కులు చెల్లించారు కూడా. అయితే ఉద్యమ సమయంలో కేసీఆర్ చాలా సార్లు జగిత్యాలకు వచ్చారు కానీ.. కొండగట్టు అంజన్న ఆలయాన్ని మాత్రం దర్శించుకోలేదు. ఆయన చివరగా 1988లో కొండగట్టుకు వచ్చాడు. మళ్లీ ఈ ఏడాది వెళ్లారు. ఇక గత ఏడాది డిసెంబర్‌లో జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. సభా వేదికగా.. కొండగట్టు, ధర్మపురి, వేములవాడ రాజన్న ఆలయాల అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
దానిలో భాగంగా తాజాగా కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని, గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు కేసీఆర్. అంతేకాక ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. కొండగట్టు క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. యాదాద్రి నూతన ఆలయ నమూనాను రూపొందించింది ఆనంద్ సాయినే.
తాజాగా కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులను కూడా ఆనంద్ సాయికే అప్పగించారు. ఇక ఆగమ శాస్త్ర పండితులు, స్థపతుల అభిప్రాయాలను కూడా తీసుకొని, కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మరి కొండగట్టును కూడా యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.