హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్. నగరవాసులకు మెట్రో భారం వేయనుంది. ఇకపై మెట్రో ప్రయాణం మరింత ప్రియం కానుంది. మరిన్ని వివరాలు మీ కోసం..
హైదరాబాద్ మెట్రో ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకుని అనేక మంది మెట్రోల్లో ప్రయాణిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా వేగవంతమైన ప్రయాణాల కోసం చాలా మంది మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, సురక్షితమైన ప్రయాణంతో పాటు వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుండటంతో మెట్రో బాగా సక్సెస్ అయింది. పొద్దున, సాయంత్రం వేళల్లో అయితే మెట్రోల్లో నిలబడేందుకు కూడా చోటు దొరకని పరిస్థితి. మన మెట్రో రైల్ రోజుకు 4.4 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అలాంటి హైదరాబాద్ మెట్రో నగరవాసులకు భారం విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రద్దీ వేళల్లో ఉండే డిస్కౌంట్లను ఎత్తివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు. సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీలు భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ మీద ఇప్పటివరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఉండేది. దీనికి కూడా కోత విధించనున్నారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ డిస్కౌంట్ ఉండదు. కేవలం ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. సెలవు దినాల్లో ప్రయాణించే హాలిడే కార్డు ధరలనూ పెంచనున్నారు. రూ.59గా ఉన్న హాలిడే కార్డు రేటును రూ.99కి పెంచనున్నారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్ ధరలను భారీగా పెంచనున్నారు. మరి.. రద్దీ వేళల్లో రాయితీలు రద్దు చేస్తూ మెట్రో తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.