విద్యుత్ వాహనాల వినియోగం గతంతో పోలిస్తే చాలా బాగా పెరిగింది. ముఖ్యంగా రాయితీల వల్లే ఈవీల కొనుగోలు బాగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యత్ వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఒక చేదు వార్త చెప్పింది.
విద్యుత్ వాహనాలు.. మెయిన్టినెన్స్ తక్కువ, పర్యావరణానికి మేలు చేస్తాయి, ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఇలా కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని మరింత ప్రోత్సహించేందుకు చాలా వెసులుబాట్లు కల్పించాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకుల వాడకం విరివిగా పెరిగింది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ నడిచే వాహనాల ధరల్లోనే విద్యుత్ వాహనాలు అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతారు. ఈవీలపై వస్తున్న రాయితీలు కూడా ఇంకో కారణంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాయితీలు చూసి ఈవీ కొనాలి అనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడంలో వాటిపై వచ్చే రాయితీలు ముఖ్య ఆకర్షణగా ఉంటాయి. వాహన తయారీదారులకు ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్-2(ఫేమ్ 2) పేరిట కిలోవాట్ అవర్ కు రూ.15 వేలు సబ్సిడీ ఇస్తూ వస్తోంది. అందువల్లే వినియోగదారులకు ఈవీలు కాస్త తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఫేమ్-2 సబ్సిడీని కిలోవాట్ అవర్ కు రూ.5 వేలు తగ్గిస్తున్నారు. అంటే కెడబ్ల్యూహెచ్ కు రూ.15 వేలు సబ్సిడీ లభించేది. ఇప్పుడు రూ.10 వేలు మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుపై ఇచ్చే ప్రోత్సాహకాలు గతంలో అయితే వాహన ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో 40 శాతం పరిమితితో ఉండేవి. ఇప్పుడు దానిని 15 శాతానికి తగ్గించనున్నారు. సవరించిన సబ్సిడీ 2023 జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న అన్ని విద్యుత్ వాహనాలకు వర్తిస్తుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
అంటే మీరు ఈవీ కొనాలి అనుకుంటే ఈ వారంలోగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లాభపడతారు. లేదంటే ఈవీ కొనుగోలుతో భారీగానే నష్టపోతారు. 2019లో ఈ రాయితీ పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా విద్యుత్ వాహనాల వాడకాన్ని వేగంగా పెంచవచ్చు అనే ఉద్దేశంతో రాయితీ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పుడు ఆ రాయితీని సవరించారు. ఈ నిర్ణయం తప్పకుండా విద్యుత్ వాహనాల కొనుగోలుపై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ విద్యుత్ వాహనాల కొనుగోలు విషయంలో చాలా మంది వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పుడు ఈ రాయితీ కూడా తగ్గించేస్తే.. ఆ ప్రభావం కచ్చితంగా అమ్మకాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫేమ్-2 సబ్సిడీ తగ్గించడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.