కారులో వెళ్తున్నప్పుడు కారు టైరు పేలితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేయలేము. అయితే ప్రమాదం లేకుండా ఏ వస్తువుతోనూ సావాసం చేయడం కుదరదు. గ్యాస్ సిలిండర్, రైస్ కుక్కర్, వాహనాలు, సెల్ ఫోన్లు ఇలా ప్రతీది వాడడం అంటే చావుతో సావాసం చేసినట్టే. అయితే టైరు పాడైనా గానీ, పేలినా గానీ ప్రమాదం జరక్కుండా ఉండేలా ఒక సరికొత్త కారును రూపొందించిందో కంపెనీ.
కార్లలో వెళ్తున్నప్పుడు టైర్ పేలితే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. వేగంగా వెళ్తున్నప్పుడు పొరపాటున టైరు పేలితే బోల్తా పడే అవకాశం ఉంది. కారులో ఉన్న వారి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అలానే టైరు ప్యాచీ పడినా, గాలి తగ్గినా కూడా కారు ఆపాల్సి ఉంటుంది. చుట్టూ ఎయిర్ పంప్స్ లేకపోయినా, మెకానిక్ షాప్స్ లేకపోయినా ఇక కారుని వదిలేసి ఏ క్యాబో, బైకో బుక్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. లేదా మెకానిక్ వచ్చేవరకూ ఎదురు చూడాల్సి ఉంటుంది. నగరాల్లో అయితే పర్లేదు గానీ మరీ పల్లెటూర్లలోనో, అడవి ప్రాంతాల్లోనో టైర్ పంక్చర్ అయితే ఏంటి పరిస్థితి? ఏ రాత్రి పూటో వెళ్తున్నప్పుడు టైరు పేలితే రాత్రంతా జాగారం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారమే ఈ సరికొత్త కారు.
చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్ (బీవైడీ) కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. షాంఘై ఆటో షోలో తమ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ సూపర్ కార్ అయినటువంటి ‘బీవైడీ యాంగ్ వాంగ్ యూ-9’ మోడల్ కారుని పరిచయం ప్రదర్శించింది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇది రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంది, బంతిలా జంప్ చేస్తుంది, మూడు చక్రాల మీద కూడా నడుస్తుంది. ఇందులో డిస్కస్-ఎక్స్ అనే అధునాతన సస్పెన్షన్స్ ను వినియోగించారు. డిస్కస్-ఎక్స్ సస్పెన్షన్ లో ఇంటిలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటిలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఈ అధునాతన సిస్టమ్స్ కారుకి ఆల్ రౌండ్స్ కంట్రోల్ ని అందిస్తాయి.
కారు డ్రైవర్ సీట్ వైపు ఉన్న ముందు చక్రం పాడైనా, పేలినా డిస్కస్-ఎక్స్ సస్పెన్షన్ కారును ముందు వైపు కొద్దిగా పైకి లేపుతుంది. ఈ కారణంగా బ్రేక్ రోటర్లు రోడ్డును తాకవు. ఇక మూడు చక్రాల మీద వెళ్ళేటప్పుడు ఈ కారు గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 2 క్షణాల్లో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే 700 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే బీవైడీ కంపెనీ ముందు టైరు లేకుండా నడుస్తున్నట్టు చూపించింది. మరి డ్రైవర్ సీట్ వైపు ఉన్న టైరు కాకుండా.. పక్క టైరు, వెనుక టైర్లు.. వీటిలో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా గానీ సాఫీగా వెళ్తుందా? లేదా? అనేది కంపెనీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరి ఒక చక్రం లేకపోయినా గానీ మూడు చక్రాల మీద నడిచేలా రూపొందించిన చైనా ఆటోమొబైల్ కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.