బ్యాటరీతో పని చేసే ఏ పరికరం వినియోగించినా సరే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహానాలు పేలడం వంటి ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో గాడ్జెట్ చేరింది. ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం పెరిగిపోతుంది. ఈ క్రమంలో అవి కూడా పేలిపోతూ.. వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. అదేదో మామూలు కంపెనీల.. వాచ్‌లు ఇలా పేలుతున్నాయనుకుంటే పొరపాటు పడ్డట్లే. దిగ్గజ కంపెనీ యాపిల్ సంస్థకు చెందని వాచ్ పేలిపోవడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆపిల్ సిరీస్ 7 వాచ్ ఇలా పేలిపోయింది. అదృష్టం బాగుండి సదరు వినియోగదారుడికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఆ వివరాలు..
ఓ వ్యక్తి ఆపిల్ సిరీస్ 7 వాచ్ చేతికి పెట్టుకుని ఉన్నాడు. ఇంతలో.. ఆ వాచ్ వేడెక్కుతున్నట్లు అతడు గుర్తించాడు. జాగ్రత్తగా పరిశీలించగా.. డివైజ్ వేడి పెరుగుతున్నట్లు అర్థం అయ్యింది. అంతేకాక.. స్మార్ట్ వాచ్ నుంచి హై టెంపరేచర్ వార్నింగ్ కూడా వచ్చింది. అలానే వాచ్ పైభాగంలో పగుళ్లు కూడా వచ్చాయి. దాంతో భయపడిన యూజర్.. వాచ్ తీసి దూరంగా విసిరేశాడు. వెంటనే ఆపిల్ సపోర్ట్‌కు కాల్ చేశడు. పరిస్థితిని వివరించాడు. దాంతో వారు డివైజ్‌కూ దూరంగా ఉండమని సూచించారు. తాము తిరిగి చెప్పేవరకు.. వాచ్‌ను ముట్టుకోరాదని సూచించారు. ఇక సదరు యూజర్ మరుసటి రోజు వాచ్‌ని చూడగా.. దాని డిస్‌ప్లే పగిలిపోయి ఉండటం గమనించాడు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాచ్ డిస్‌ప్లే పేలిపోయిందని కనుగొన్నాడు.
అయితే సదరు వినియోగదారుడు వాచ్‌ను కిటీకి నుంచి బయటకు విసిరేసే సమయంలోనే అది పగిలిపోయినట్లు తెలిసింది. అంతేకాక వాచ్‌ను చేతి నుంచి తీసేటప్పుడు సౌండ్ వచ్చిందని సదరు యూజర్ వెల్లడించాడు. అంతేకాక వాచ్ పేలుడు సంఘటనలో వినియోగదారుడి మంచం కూడా కాలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తి బ్యాటరీలో ఉండే సీసం విషపూరితమని భయపడి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం ఆపిల్ స్టోర్‌ని సంప్రదించి.. పరిస్థితిని వివరించాడు.
ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం.. సదరు వ్యక్తి ఇంటికి వచ్చి.. వాచ్ పికప్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలు ఇంతవరకు స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఆపిల్ ప్రొడక్టు లేదా స్మార్ట్ డివైజ్ పేలడం లేదా పగిలిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2021లో, ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి అతడు వాడే ఐఫోన్ X పేలడంతో ఆసుపత్రి పాలయ్యాడు. లిథియం-అయాన్ బ్యాటరీలలో పేలుడు అంత సాధారణంగా జరిగే అంశం కాదు. బ్యాటరీల లోపల ఉష్ణోగ్రతతో పాటు.. పరిసరాల ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే పెరుగుదల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.