మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఓవర్ హీట్ అవుతుందా? ఉన్నట్టుండి సడన్ గా ఆగిపోతుందా? కంప్యూటర్ లో ఉన్న హీట్ సింక్, ఫ్యాన్లు.. ల్యాప్ టాప్ కోసం వాడే కూలింగ్ ప్యాడ్ వంటి వాటి వల్ల ప్రయోజనం లేదని బాధపడుతున్నారా? హీట్ కారణంగా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ పాడవ్వకుండా ఉండడానికి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారా? అసలు హీట్ రాకుండా ఉంచే డివైజ్ ఏదైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సరికొత్త డివైజ్. ఈ డివైజ్ ని మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ లో పెట్టుకుంటే మీ వస్తువులు పాడవ్వకుండా ఉంటాయి. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు కొన్న కొత్తలో బాగానే పని చేస్తాయి. అయితే వాడే కొద్దీ స్పీడ్ తగ్గుతుంది. ప్రాసెసర్ హీట్ అవుతుంటుంది.
ల్యాప్ టాప్ ల కింద కూలింగ్ ప్యాడ్లు, కంప్యూటర్ లోపల ఫ్యాన్లు, హీట్ సింక్ లు వాడినా గానీ ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులకు ప్రాసెసర్ మరీ హీట్ ఎక్కువైపోతోంది. దీని వల్ల కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఉన్నట్టుండి షట్ డౌన్ అవుతుంటాయి. దీనికి పరిష్కారంగా ఒక డివైజ్ ను తీసుకొచ్చింది అమెరికన్ స్టార్టప్ కంపెనీ. ల్యాప్ టాప్, కంప్యూటర్లలో పని చేస్తున్నప్పుడు ప్రాసెసర్లు అనేవి హీట్ ఎక్కుతాయి. ఆ హీట్ ని తగ్గించడం కోసం లోపల హీట్ సింక్, కూలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ ప్యాడ్స్ వాడుతుంటారు. అయినప్పటికీ సిస్టమ్ లు ఓవర్ హీట్ అవుతుంటాయి. దీని వల్ల ల్యాప్ టాప్, కంప్యూటర్ల సామర్థ్యం తగ్గి నెమ్మదిస్తాయి. కొన్ని సార్లు లోపల సర్క్యూట్లు కాలిపోయే అవకాశం ఉంది.
ఫ్యాన్లు, హీట్ సింక్ వాడినా గానీ ప్రయోజనం పెద్దగా ఉండడం లేదు. దీంతో అమెరికా స్టార్టప్ సంస్థ అయిన ఫ్రోర్ సిస్టమ్స్ ఒక సరికొత్త డివైజ్ ను పరిచయం చేసింది. గత నెలలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎయిర్ జెట్ టెక్నాలజీ ఆధారిత పరికరాన్ని ప్రదర్శించింది. ఇది ఒక చిప్ లా ఉండి.. ల్యాప్ టాప్, కంప్యూటర్ లలో ఉండే ప్రాసెసర్ చిప్ ల వేడిని తగ్గిస్తుంది. వీటిని ల్యాప్ టాప్, కంప్యూటర్ లో ఏర్పాటు చేసుకుంటే వేడిని తొలగించి.. సమర్థవంతంగా పని చేసేలా చేసుకోవచ్చునని సంస్థ సీఈఓ డాక్టర్ మాధవపెద్ది శేషు వెల్లడించారు. ఎయిర్ జెట్ టెక్నాలజీతో రెండు చిప్ లను తయారు చేశారు. ఒకటి ఎయిర్ జెట్ మినీ, మరొకటి ఎయిర్ జెట్ ప్రో.
ఎయిర్ జెట్ మినీ చిప్ 41.5 మిల్లీమీటర్ల పొడవు, 270 మిల్లీమీటర్ల వెడల్పు, 2.8 మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఒక వాట్ విద్యుత్ ని వాడుకుంటూ 5.25 వాట్లకు సరిపడా వేడిని తొలగించగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక ఎయిర్ జెట్ ప్రో 71.5 మిల్లీమీటర్ల పొడవు, 31.5 మిల్లీమీటర్ల వెడల్పు కలిగి ఉండి.. 1.75 వాట్ల విద్యుత్ ని వాడుకుంటుంది. దీంతో 10.75 వాట్లకు సరిపడా వేడిని ఇది తగ్గిస్తుంది. ఇక ఈ చిప్ ల నుంచి వచ్చే శబ్దం చాలా తక్కువ. గరిష్టంగా 24 డెసిబెల్స్ స్థాయిలో ఉంటుంది. ఇక వీటి బరువు కూడా తక్కువే. 13 నుంచి 22 గ్రాముల మధ్యలో ఉంటుంది. 13 అంగుళాల నోట్ బుక్ లో 4 ఎయిర్ జెట్ మినీ చిప్ లను అమరిస్తే.. మైక్రో ప్రాసెసర్ సామర్థ్యం 100 శాతం వరకూ పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. అలానే 15 అంగుళాల నోట్ బుక్ లో 3 ఎయిర్ జెట్ ప్రో చిప్ లను పెడితే.. దాని సామర్థ్యం 50 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతుంది. పైగా ఈ చిప్ లు డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇప్పటికే మైక్రో ప్రాసెసర్లను తయారు చేసే ఇంటెల్ సంస్థ.. ఫ్రోర్ సిస్టమ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. తాము తయారు చేసే ల్యాప్ టాప్ లలో ఎయిర్ జెట్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ఇంటెల్ సంస్థ వెల్లడించింది. ఇక క్వాల్ కాం ప్రాసెసర్ నాసంస్థ కూడా ఫ్రోర్ సిస్టమ్స్ లో పెట్టుబడులు భారీగా పెట్టింది. ప్రపంచంలో ఉన్న టాప్ 10 ప్రాసెసర్ చిప్స్ తయారుచేసే సంస్థల్లో 5 సంస్థలు ఫ్రోర్ సిస్టమ్స్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎయిర్ జెట్ మినీ, ఎయిర్ జెట్ ప్రో చిప్ లు ఇంకా ఉత్పత్తి దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ధర ఎంత ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
ల్యాప్ టాప్, కంప్యూటర్ హీట్ సమస్యను అధిగమించేందుకు ఫ్రోర్ సిస్టమ్స్ తయారు చేస్తున్న ఎయిర్ జెట్ టెక్నాలజీ అనేది ప్రపంచంలోనే తొలి సాలిడ్ స్టేట్ కూలింగ్ టెక్నాలజీ. 2 రెట్లు అధికంగా మెరుగైన పనితీరుని ప్రదర్షిస్తుంది. అందులోనూ నిశ్శబ్దంగా పని చేస్తుంది సైజ్ లో చిన్నగా, సన్నగా, చాలా లైట్ వెయిట్ తో, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తోంది. వేడి తగ్గించి డివైజ్ వేగాన్ని పెంచడంలో విభిన్న సామర్థ్యం కలిగి ఉన్నది.
ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లలో ప్రాసెసర్ల హీట్ ని ఎప్పటికప్పుడు తగ్గించకపోతే అవి షెడ్డుకెళ్లిపోయే అవకాశం ఉంది. హీట్ పెరిగితే.. ప్రాసెసర్లు కాలిపోయే ప్రమాదం ఉంది. మైక్రో ప్రాసెసర్ వేగం పెరిగిన ప్రతిసారీ 70 శాతం వరకూ వేడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వేడి ఇలానే కొనసాగితే ప్రాసెసర్ చిప్ లు కాలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఫ్రోర్ సిస్టమ్స్ కంపెనీ ఎయిర్ జెట్ చిప్ లను తీసుకొస్తోంది. మరి ఇవి అందుబాటులోకి వస్తే నిజంగా ల్యాప్ టాప్, కంప్యూటర్లు వాడే వారికి మంచి చేకూరినట్టే అవుతుంది. మరి ఓవర్ హీట్ సమస్య నుంచి ల్యాప్ టాప్, కంప్యూటర్, నోట్ బుక్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించే అధునాతన డివైజ్ ను కనుగొన్న ఫ్రోర్ సిస్టమ్స్ కంపెనీపై మీ అభిప్రాయం ఏమిటి? భారతీయ సంతతికి చెందిన మాధవపెద్ది శేషు ఈ ఆవిష్కరణలో భాగం కావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.